ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడుకు ఇబ్బందికర పరిస్ధితులు ఎదురయ్యాయి. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎంపీ పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేయబోతున్నారు. అలాగే ఆయన కూతురు శ్వేత కార్పొరేటర్ పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యారు. ఇదే సమయంలో రాబోయే ఎన్నికల్లో తాను పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా చంద్రబాబుకు చెప్పేశారట. ఎంపీగా పోటీ చేయకపోవటమే కాదు పార్టీకి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారని సమాచారం.





అంటే ఇపుడు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు నియోజకవర్గాల్లోను చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో కొత్తవారిని ఎంపికచేసుకోవాల్సిందే. ఇపుడు టీడీపీలో అతిపెద్ద సమస్య ఏమిటంటే 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు చాలాచోట్ల బలమైన అభ్యర్ధులు లేరు. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా వచ్చేఎన్నికల్లో ఎంపీగా కాకుండా నర్సీపట్నం ఎంఎల్ఏగా పోటీచేస్తానని అధినేతతో స్పష్టంగా చెప్పేశారట. ఎంపీ అభ్యర్ధిని రెడీచేసుకోమని చాలా రోజుల క్రితమే చెప్పినట్లు పార్టీవర్గాల సమాచారం. అయితే అందుకు చంద్రబాబు అంగీకరించలేదని కూడా తమ్ముళ్ళు చెబుతున్నారు.





ఎంపీ కేశినేని నానిని పార్టీ నుండి బహిష్కరించినట్లు పరోక్షంగా కబురుచేసిన చంద్రబాబు మరుసటిరోజే కాళ్ళబేరానికి దిగజారిపోయారు. తిరువూరులో జరిగిన బహిరంగసభకు ఎంపీని వచ్చేట్లు చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. అయితే ఎంపీ మాత్రం సభకు హాజరుకాలేదు. బహిరంగసభలో ఎంపీకి ప్రత్యేకించి సీటు కూడా టీడీపీ కేటాయించినా ఉపయోగంలేకపోయింది. ఇదే సమయంలో తన పార్టీ ఆఫీసు కేశినేని భవన్ లో టీడీపీ, చంద్రబాబు, లోకేష్ ఫ్లెక్సీలు, కటౌట్లను ఎంపీ తొలగించేశారు.





తిరువూరు బహిరంగసభలో ఎంపీతో పాటు ఆయన వర్గమంతా ఎక్కడా కనబడలేదని పార్టీలో టాక్ వినబడుతోంది. ఎంపీగనుక అడ్డంతిరిగితే రేపటి ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల గెలుపు అంత సులభంకాదని చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకనే ముందు బహిష్కరణని చెప్పి తర్వాత బతిమలాడుకుంటున్నారు. ఈరోజు కూతురు కేశినేని శ్వేత, ఒకటి రెండురోజుల్లో నాని తమ ఎంపీ, కార్పొరేటర్ పదవులకు రాజీనామాలు చేయబోతున్నారు. రాజీనామాలు చేస్తే చంద్రబాబుకు అసలు సినిమా మొదలవుతుంది. మరి ఏమి జరుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: