ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ తెలుగుదేశంపార్టీలో అయోమయం పెరిగిపోతోందని సమాచారం. ఈ అయోమయం కూడా రెండు రకాలుగా ఉందట. మొదటిదేమో చాలామంది సీనియర్లకు టికెట్లు ఇచ్చేదిలేదని చంద్రబాబు చెప్పారట. దాంతో చాలామంది చంద్రబాబు, లోకేష్ పైన మండిపోతున్నారు. ఎందుకంటే సీనియర్లలో కొందరికేమో కుటుంబానికి రెండు టికెట్లు ఇస్తున్న చంద్రబాబు మరికొందరి కుటుంబాల్లో మాత్రం ఒకటే టికెట్ ఇస్తానని చెబుతున్నారట. దాంతో వాళ్ళ ఎక్కువేమిటి, తమ తక్కువేమిటని ప్రశ్నస్తున్నారు.
ఇక రెండో రకం సీనియర్లలో ఎవరి సీట్లు గల్లంతైపోతాయో తెలీక ఇబ్బంది పడుతున్నారట. జనసేన పొత్తులో ఎన్నోకొన్ని సీట్లను టీడీపీ వదులుకోవాల్సుంటుంది. జనసేన అధినేత ఎన్ని సీట్లు అడుగుతున్నారో, చంద్రబాబు ఎన్ని సీట్లిస్తారో తెలీటంలేదు. ఇదే సమయంలో ఇచ్చే నియోజకవర్గాలు ఏవో కూడా తెలీటంలేదు. దాంతో టికెట్ల రావటం కష్టమే అని అనుమానంగా ఉన్న సీనియర్ తమ్ముళ్ళు కూడా చంద్రబాబు, లోకేష్ పైన మండిపోతున్నారట.
తమ టికెట్ల సంగతి ఏమిటో తేలిస్తే కాని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేది లేనిది తాము తేల్చుకోలేమని గట్టిగానే చెబుతున్నట్లు పార్టీవర్గాల చెబుతున్నాయి. ఈ క్యాటగిరిలో పెందుర్తి, భీమిలీ, పాయకరావుపేట, తిరుపతి, పిఠాపురం, కాకినాడ సిటి, రాజమండ్రి రూరల్, విజయవాడ పశ్చిమం, తెనాలి, నెల్లూరు, ఆళ్ళగడ్డ, చంద్రగిరి లాంటి నియోజకవర్గాల్లో జనసేన పోటీచేయబోతోందనే ప్రచారం పెరిగిపోతోంది. ఇదే ఖాయమైతే పై నియోజకవర్గాల్లోని తమ్ముళ్ళ ఆశలపై నీళ్ళు చల్లినట్లే. అందుకనే టికెట్లపై గోలచేస్తున్న తమ్ముళ్ళకి సర్దిచెప్పలేక చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది.
టికెట్ల కష్టాలు, నియోజకవర్గాలు గల్లంతయ్యే ప్రమాదం ఉంది కాబట్టే తమ్ముళ్ళ రియాక్షన్ కు భయపడే పొత్తులో టికెట్ల సంఖ్య, నియోజకవర్గాల వివరాలను చంద్రబాబు ప్రకటించటంలేదు. ఎప్పుడు ప్రకటించినా ఈ సమస్యలు తప్పవన్న విషయాన్ని చంద్రబాబు మరచిపోయారు. ఆ ప్రకటనేదో ఇపుడే చేసేస్తే గొడవలను సర్దుబాటు చేసుకునేందుకు అవకాశం ఉందన్న విషయాన్ని మరచిపోతున్నారు. ఒకవైపు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి టికెట్లను ఫైనల్ చేసేస్తుంటే టీడీపీలో అయోమయం మాత్రం అంతకంతకు పెరిగిపోతోంది.