పొత్తులో ఉన్న టీడీపీ-జనసేన మధ్య విభేదాలు రోడ్డున పడుతున్నాయి. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ పోటీగా నియోజకవర్గాలను ప్రకటించుకుంటున్నారు. చంద్రబాబు ఏకపక్షంగా రెండు నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించటాన్ని పవన్ తప్పుపట్టారు. పొత్తు ధర్మాన్ని చంద్రబాబు విస్మరించి రెండు నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించారు కాబట్టి జనసేన కూడా రెండు నియోజకవర్గాల్లో పోటీచేస్తుందని ప్రకటించారు. అభ్యర్ధులను ప్రకటించి చంద్రబాబు తప్పుచేశారని పవన్ అభిప్రాయపడ్డారు. పొత్తులో ఉన్నపుడు ఏకపక్ష ప్రకటనలు ఉండకూడదన్నారు.





ఇంతకీ విషయం ఏమిటంటే చంద్రబాబు రెండు నియోజకవర్గాలు మండపేట, అరకులో అభ్యర్ధులను ప్రకటించారు. మండపేటలో జోగేశ్వరరావు, అరకులో సివేరి సోములను చంద్రబాబు ప్రకటించారు. ఆ విషయాన్ని మండపేట సమీక్షలో జనసేన నేతలు పవన్ తో చర్చించారు. మంగళగిరి పార్టీ ఆఫీసులో జరిగిన సమావేశంలో ఇదే విషయాన్ని పవన్ ప్రస్తావించారు. ప్రత్యేక పరిస్ధితుల్లో చంద్రబాబు రెండు నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించారు కాబట్టి రిపబ్లిక్ డే సందర్భంగా తాను కూడా రెండు సీట్లను ప్రకటిస్తున్నట్లు చెప్పారు.





రాబోయే ఎన్నికల్లో జనసేన రాజానగరం, రాజోలులో పోటీచేస్తుందని సమావేశంలో ప్రకటించారు. నియోజకవర్గాల్లో పోటీచేయాలని టీడీపీ నేతల నుండి చంద్రబాబుపై ఒత్తిడి వస్తున్నట్లుగానే జనసేన నేతల నుండి తనపైన కూడా అంతే ఒత్తిడి వస్తోందన్నారు. ఏదేమైనా చంద్రబాబు ఏకపక్షంగా నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించి ఉండకూడదన్నారు. రాబోయే సమావేశంలో ఈ విషయంపై తాను చంద్రబాబుతో మాట్లాడుతానని చెప్పారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు ప్రకటించిన రెండు నియోజకవర్గాల్లో మండపేట టీడీపీకి బలమైన నియోజకవర్గం.





ఇక్కడ నుండి జోగేశ్వరరావు వరుసగా మూడు ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ ఎంఎల్ఏ అనిపించుకున్నారు. నాలుగోసారి అంటే 2024 ఎన్నికల్లో కూడా పోటీచేసి గెలవాలని రెడీ అవుతున్నారు. పొత్తులో జనసేనకు చంద్రబాబు మండపేటను వదిలిపెట్టే అవకాశాలు చాలా తక్కువ. మండపేట నియోజకవర్గాన్ని ఇవ్వకూడదన్న ఉద్దేశ్యంతోనే చంద్రబాబు జోగేశ్వరరావును అభ్యర్ధిగా ప్రకటించుంటారు. దానిపై పవన్ సీరియస్ అయ్యారు. మరి పవన్ తాజా వ్యాఖ్యల నేపధ్యంలో పొత్తు చర్యలపై ఆసక్తి పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: