
రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీకి సంబంధించిన మూడు అసెంబ్లీ నియోజకవర్గాలపై జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టిపెట్టారు. అందుకనే మూడునియోజకవర్గాలను ప్రత్యేకంగా ముగ్గురు సీనియర్లకు బాధ్యతలు అప్పగించి తాను ఓవరాలుగా సమీక్షలు చేస్తున్నారు. వచ్చేఎన్నికల్లో చంద్రబాబునాయుడును కుప్పంలో, వియ్యంకుడు కమ్ బావమరిది నందమూరి బాలయ్యను హిందుపురంలో, మంగళగిరిలో నారా లోకేష్ ను ఓడించాలన్నది జగన్ పట్టుదల. రెండు నియోజకవర్గాల్లో టీడీపీని ఓడించటం, ఒక నియోజకవర్గాన్ని నిలబెట్టుకోవటమే జగన్ టార్గెట్.
కుప్పంలో చంద్రబాబును ఓడించటానికి జగన్ చాలా ప్లాన్లే వేస్తున్నారు. ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో నియోజకవర్గం మొత్తాన్ని స్వీప్ చేయటంతో రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించచ్చనే ధైర్యం జగన్ కు వచ్చింది. అందుకనే ఇక్కడ క్యాండిడేట్ గా భరత్ ను చాలాకాలం క్రితమే ప్రకటించి ఎంఎల్సీని కూడా చేశారు. రెగ్యులర్ గా నియోజకవర్గంలో తిరిగే బాధ్యత రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి అప్పగించారు.
హిందుపురంలో రెండు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి నందమూరి బాలయ్య చేతిలో వైసీపీ అభ్యర్ధులు ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో నవీన్ నిశ్చల్, 19లో షేక్ మహ్మద్ ఇక్బాల్ పోటీచేశారు. ఇక్కడ సమస్య ఏమిటంటే నియోజకవర్గంలోని నేతల్లోని అనైక్యతే. నవీన్ అంటే చాలామందికి పడదు. అలాగే చాలామంది వ్యతిరేకించిన ఇక్బాల్ నే జగన్ అభ్యర్ధిని చేశారు. దాంతో చాలామంది పార్టీ గెలుపుకు పనిచేయకపోవటంతో బాలయ్య గెలుస్తున్నారు. నేతలందరినీ ఏకతాటిపైకి తెచ్చి బాలయ్యను ఓడించే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపైన పెట్టారు.
ఏడాదిన్నరగా పెద్దిరెడ్డి హిందుపురంపైనే ప్రత్యేక దృష్టిపెట్టారు. లోకల్ నేత, కురబ సామాజికవర్గానికి చెందిన దీపికను పెద్దిరెడ్డే అభ్యర్ధిగా ఎంపికచేశారు. అలాగే బోయ సామాజికవర్గానికి చెందిన శాంతమ్మను ఎంపీగా ఎంపికచేశారు. నియోజకవర్గంలో బోయ, కురబ సామాజికవర్గం ఓట్లు చాలాఎక్కువ. అందుకనే పెద్దిరెడ్డి వ్యూహాత్మకంగా పై రెండు సామాజికవర్గాలకే టికెట్లు వచ్చేట్లు చేశారు. దీపిక భర్త రెడ్డి సామాజికవర్గం నేత.
ఇక మంగళగిరిలో మూడోసారి వైసీపీని తిరిగి గెలిపించే బాధ్యత రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి అప్పగించారు. అభ్యర్ధిగా చేనేత సామాజికవర్గానికి చెందిన గంజి చిరంజీవిని ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో బీసీలు ప్రత్యేకించి చేనేతలు చాలా ఎక్కువున్నారు. రెండోసారి లోకేష్ ను ఓడించాల్సిందే అని విజయసాయికి జగన్ స్పష్టంగా చెప్పారు. అందుకనే ఎంపీ ప్రత్యేకంగా మంగళగిరిలో క్యాంపేస్తున్నారు. మరి ముగ్గురు నేతల్లో ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి.