తొందరలోనే బీఆర్ఎస్ అధినేత కేసీయార్ కు బిగ్ షాక్ తగిలేట్లుంది. విషయం ఏమిటంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ ఖాతాలో పడేట్లుంది. తాజాగా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అవటంతోనే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. రేవంత్ తో తన భేటీ కేవలం మర్యాదపూర్వకమే అని, అధికారికమే అని మేయర్ చెప్పారు. అయితే దాన్ని ఎవరు నమ్మటంలేదు. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చాలామంది బీఆర్ఎస్ నేతలు రేవంత్ ను కలుస్తునే ఉన్నారు.





వీరిలో కొందరు బీఆర్ఎస్ కు రాజీనామాలు చేసి కాంగ్రెస్ లో చేరిపోయారు. మరికొందరు అదే దారిలో ఉన్నారు. తాజాగా  మాజీ ఉపముఖ్యమంత్రి తాటిపర్తి రాజయ్య కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఇప్పటి రాజకీయాల్లో సిద్ధాంతాలు లేవు పాడులేవు. ఉన్నదంతా రాద్ధాంతం, అధికారాన్ని అనుభవించటమే. మొత్తం పవర్ పాలిటిక్స్ అయిపోయాయి కాబట్టి ప్రతిపక్షంలోని ప్రజాప్రతినిధులు అధికారం లేకుండా ఉండలేకపోతున్నారు. వ్యాపారాలు, కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్ సంస్ధలను కాపాడుకోవాలన్నా, కాంట్రాక్టుల బిల్లులను వెంటనే రాబట్టుకోవాలన్నా అధికారపార్టీలో ఉండటమే శరణ్యం.





ఈ నేపధ్యంలోనే విజయలక్ష్మి కూడా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి జంపయ్యేందుకు రంగం సిద్ధమవుతోందనే ప్రచారం పెరిగిపోతోంది. నిజానికి 150 డివిజన్లున్న కార్పొరేషన్లో కాంగ్రెస్ కు ఉన్నది రెండంటే రెండు కార్పొరేటర్లు మాత్రమే. అయితే అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ తరపున గెలిచిన 56 మంది కార్పొరేటర్లలో 26 మంది కాంగ్రెస్ లో చేరటానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం  పెరిగిపోతోంది. వీళ్ళకి ఎంఐఎం తరపున గెలిచిన 44 మంది కార్పొరేటర్ల మద్దతు దొరుకుతుందట.





కాబట్టి ఒకపుడు బీఆర్ఎస్ కు మద్దతిచ్చిన ఎంఐఎం ఇపుడు కాంగ్రెస్ కు దగ్గరయ్యింది. అవసరమైతే ఎంఐఎంకు డిప్యుటి మేయర్ ఇచ్చేస్తుంది  కాంగ్రెస్.  కాబట్టి ఆ పార్టీకి మద్దతు ఇవ్వటానికి ఎలాంటి అభ్యంతరం ఉండదని అనుకుంటున్నారు. పరిస్ధితులన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఏదోరోజు 24 మంది కార్పొరేటర్లతో విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరిపోవటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. అదే జరిగితే కేసీయార్ కు పెద్ద షాకనే చెప్పాలి. మరపుడు మేయర్ తండ్రి, బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కేశవరావు ఏమి చేస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: