రాబోయే ఎన్నికల్లో పొత్తు విషయంలో చంద్రబాబునాయుడుపై బాగా ఒత్తిడి పెరిగిపోతోంది. బీజేపీతో పొత్తుపెట్టుకునే ఉద్దేశ్యంతో ఢిల్లీకి వెళ్ళిన చంద్రబాబు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయిన విషయం తెలిసిందే. తర్వాత అమరావతికి తిరిగివచ్చిన చంద్రబాబు బీజేపీతో పొత్తు విషయమై సీనియర్లతో అభిప్రాయసేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా చాలామంది బీజేపీతో పొత్తును తీవ్రంగా వ్యతిరేకించారు. ఇపుడు అదే పద్దతిలో ముస్లిం మైనారిటీలు కూడా కమలంపార్టీతో పొత్తు వద్దని గట్టిగా చెబుతున్నారట.





అయితే భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీతో పొత్తు తప్పదన్నట్లుగా చంద్రబాబు చెప్పారు. దాన్నే మైనారిటి నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. పార్టీలోని జిల్లాల్లోని ముస్లిం మైనారిటి నేతలు ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టుకుంటున్నట్లు సమాచారం. జిల్లాల్లో ఆత్మీయ సమావేశాలు పెట్టుకుని బీజేపీతో పొత్తును వ్యతిరేకిస్తు తీర్మానాలు చేస్తున్నట్లు పార్టీవర్గాల సమాచారం. బీజేపీతో పొత్తు తప్పదంటే తమ దారేదో తాము చూసుకోవాల్సొస్తుందని కూడా చెప్పేస్తున్నారట. టీడీపీలోని ముస్లిం మైనారిటి నేతల్లో ఇప్పటికే ప్రత్యామ్నాయాలను చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.




ముందుగా కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్ లోకి వెళుతున్నారట. ఈ డెవలప్మెంట్లు ఎక్కువగా రాయలసీమలోనే కనబడుతోంది. ఎందుకంటే సీమలోని 52 నియోజకవర్గాల్లో సుమారు 24 నియోజకవర్గాల్లో  ముస్లిం మైనారిటీల ప్రభావం ఎక్కువగా ఉంది.  వీటిల్లో అత్యధికం కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. పై జిల్లాలతో పోల్చితే చిత్తూరు జిల్లాలో ముస్లిం మైనారిటీల ప్రభావం నాలుగు నియోజకవర్గాలు మదనపల్లి, పీలేరు, పుంగనూరు, తిరుపతిలో కనబడుతుంది.





మొత్తానికి జిల్లాల వారీగా మైనారిటీల సెల్లుల మీటింగుల్లో బీజేపీతో పొత్తును వ్యతిరేకిస్తు తీర్మానాలు చేసి చంద్రబాబుకు పంపుతున్నారు. తొందరలోనే రాష్ట్ర కమిటిలో కూడా ఇదే విషయాన్ని చర్చించాలని మైనారిటీ నేతల మధ్య చర్చలు జరుగుతున్నట్లు టాక్. బీజేపీతో పొత్తు విషయంలో చంద్రబాబు ఆలోచన ఒకలాగ ఉంటే ముస్లిం మైనారిటీ నేతల ఆలోచనలు మరోరకంగా ఉంటున్నాయి. ఇతర సామాజికవర్గాలకు చెందిన నేతలు కూడా కమలంపార్టీతో పొత్తు వద్దనే చెబుతున్నారట. అయితే మైనారిటీ నేతలు మాత్రం బహిరంగంగానే తమ ఆందోళనను వ్యక్తంచేస్తున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: