ఉత్తరాంధ్రలోని మన్యం ప్రాంతంలో టీడీపీకి బాగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో కొన్నింటినైనా గెలవాలన్నది చంద్రబాబునాయుడు పట్టుదల. అయితే అందుకు పరిస్ధితులు ఏమాత్రం సహకరించటంలేదు. గడచిన రెండు ఎన్నికల్లో టీడీపీ నుండి ఒక్కరంటే ఒక్క ఎస్టీ నేత కూడా అసెంబ్లీ లేదా పార్లమెంటుకు గెలవలేదు. ఎస్టీలకు రిజర్వయిన ఏడు అసెంబ్లీ సీట్లలోను వరుసగా వైసీపీనే గెలుస్తోంది.





అలాంటిది రాబోయే ఎన్నికల్లో అయినా కనీసం ఒక్క సీటులో అయినా గెలవాలని అనుకుంటే అదికూడా నెరవేరేట్లులేదు. పాడేరులో టీడీపీ లీడర్ గిడ్డి ఈశ్వరికి టికెట్ ఆశించారు. అయితే ఈ సీటును బీజేపీకి కేటాయించబోతున్నట్లు చంద్రబాబు చెప్పారట. దాంతో మండిపోయిన గిడ్డి తిరుగుబాటు అభ్యర్ధిగా పోటీచేయబోతున్నట్లు తెలిసింది. ఐదేళ్ళు ఆమెతో పనిచేయించుకున్న చంద్రబాబు చివరినిముషంలో నియోజకవర్గాన్ని పొత్తులో బీజేపీకి కేటాయించటాన్ని తట్టుకోలేకపోతున్నారు. అందుకనే భవిష్యత్ కార్యాచరణపై గురువారం తన మద్దతుదారులతో కీలక సమావేశం పెట్టుకున్నారు.





గిడ్డి ఈశ్వరి వైసీపీలో చేరిన తర్వాత గట్టినేతగా బాగా ఎలివేట్ అయ్యారు. నియోజకవర్గంలోనే కాకుడా మన్యం ప్రాంతంలో ఆమె చేసిన కష్టాన్ని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి 2014 ఎన్నికల్లో పాడేరు టికెట్ ఇచ్చారు. దాంతో అప్పటివరకు స్కూలు టీచర్ గా ఉన్న ఈశ్వరి ఎంఎల్ఏగా గెలిచారు. తర్వాత కొంతకాలానికి టీడీపీలోకి ఫిరాయించారు. దాంతో 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీచేసినా గెలవలేదు. మూడోసారి ఎన్నికల్లో మళ్ళీ గెలవాలని పట్టుదలగా పనిచేసినా చివరకు పోటీకి అవకాశమే లేకుండా పోతోంది.





అందుకనే ఇండిపెండెంటుగా అయినా సరే పోటీచేసి గెలవాలని డిసైడ్ అయ్యారు. అందుకనే తన మద్దతుదారులతో మీటింగ్ పెట్టుకున్నారు. అయితే అరకు ఎంపీగా బీజేపీ తరపున పోటీచేయబోతున్న కొత్తపల్లి గీతకు గిడ్డికి ఏమాత్రం పడదట. అందుకనే గిడ్డిని దెబ్బకొట్టేందుకే గీత పొత్తులు, సీట్ల సర్దుబాటులో పాడేరు అసెంబ్లీని బీజేపీకి దక్కేట్లుగా చక్రంతిప్పారనే ప్రచారం పెరిగిపోతోంది. మరి మద్దతుదారుల సమావేశంలో గిడ్డి ఈశ్వరి ఏమి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: