ఏపీలో ఎన్నికల ప్రచారానికి సీఎం, వైసీపీ అధినేత జగన్ శ్రీకారం చుట్టారు. బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ బస్సు యాత్రపై ఆదిలోనే విమర్శలొస్తున్నాయి. ఏదో తూతూ మంత్రంగా బస్సు యాత్ర చేపడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సొంత పార్టీ నేతలే జగన్ బస్సు యాత్రపై పెదవి విరుస్తున్నారు. దీంతో ఎన్నికల్లో వైసీపీకి ఎంతో కీలకమైన ఈ బస్సు యాత్రపై పార్టీ నేతలు జాగ్రత్తలు తీసుకోవాలనే సూచనలు వస్తున్నాయి. ప్రతిపక్షాలు, మీడియా నుంచి కాకుండా సొంత పార్టీలోనే ఈ బస్సు యాత్రపై లుకలుకలు రాకుండా జాగ్రత్త పడాలని అంతా సూచిస్తున్నారు. ఇక ఈ బస్సు యాత్ర ఈ నెల 27న ప్రారంభం అయింది. 

ఇడుపులపాయలో బస్సు యాత్ర బయల్దేరి కడప జిల్లాలోనే ప్రొద్దుటూరులో బహిరంగ సభతో తొలి రోజు ముగిసింది. ఆ తర్వాత రోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలోకి బస్సు యాత్ర ప్రవేశించింది. రాజకీయంగా కీలకమైన ఆళ్లగడ్డకు బస్సు యాత్ర రాత్రి 10 గంటలకు చేరుకుంది. మూడో రోజు ఉదయం 9.30 గంటలకు బస్సు యాత్ర తిరిగి ప్రారంభమైంది. అయితే ఈ యాత్రపై నాయకుల మధ్య సమన్వయం లోపించిందనే విషయం బాగా అర్థం అవుతోంది. యాత్ర తీరుతెన్నులు, రాజకీయ వ్యూహాలు వంటి వాటిపై జగన్ నుంచి ఎలాంటి డైరెక్షన్స్ లేవు. అంతేకాకుండా స్థానిక నాయకులను ఏమీ పట్టించుకోకుండా యాత్ర కొనసాగుతుందనే విమర్శలు వస్తున్నాయి.

వైఎస్ జగన్ ప్రస్తుతం సీఎం. రాష్ట్రంలో అధికార పార్టీకి ఆయన అధినేత. దీంతో ఆయనతో కరచాలనం చేయాలని, ఫొటో దిగాలని ఎంతో మంది కార్యకర్తలు ఎదురు చూస్తుంటారు. అలాంటి వారందరూ జగన్ అనుసరిస్తున్న వైఖరితో ఖంగుతింటున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేవలం 50 మందికి మాత్రమే ఆయన ఫొటోలు దిగేందుకు అనుమతి ఇస్తున్నారనే ప్రచారం సాగుతోంది. దీంతో తమ అభిమాన నేత పెట్టే నిబంధనలు క్యాడర్‌కు ఏ మాత్రం రుచించడం లేదు. అంతేకాకుండా ఆళ్లగడ్డలో రాజకీయ పరిస్థితిపై స్థానిక ఎమ్మెల్యే బ్రిజేంద్రనాథ్ రెడ్డితో ఏ మాత్రం చర్చించలేదని సమాచారం. అయితే కేవలం మేధావులు, తటస్థులతో సమావేశం నిర్వహించి మమ అనిపించేశారని స్థానిక పార్టీ క్యాడర్ బాధ పడుతోంది. బస్సు యాత్రలో జగన్ అనుసరిస్తున్న వైఖరి పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశను నింపుతోంది. దీంతో జగన్ బస్సు యాత్ర తుస్సుమందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీలో కొందరు జగన్ బస్సు యాత్ర ఇలా జరగడానికి కారణమని విమర్శలొస్తున్నాయి. అయితే వైసీపీ నష్టనివారణ చర్యలు చేపడుతుందా లేక ఇదే తరహాలో యాత్ర ముందుకు సాగుతుందా అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: