అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఖైరతాబాద్ నుండి పోటీ చేసి గెలిచిన దానం నాగేందర్ రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ లో చేరిన సంగతి తెలిసిందే . అయితే ఇప్పుడు దానం నాగేందర్ పరిస్థితి అటూ ఇటూ కాకుండా పోయేలా రాజకీయ పరిణామాలు కనిపిస్తున్నాయి . మొదట పార్టీలో చేరితే సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇస్తామని కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దానం నాగేందర్ బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్టు సమాచారం.

అయితే పార్టీలో చేరే సమయంలో కాంగ్రెస్ అధిష్టానం దానంకు ఓ కండిషన్ కూడా పెట్టినట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగాలంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని ముందే కండిషన్ పెట్టారట. మొదట దానం నాగేందర్ ఆ కండిషన్ కు ఒప్పుకుంటున్నట్టు సమాచారం. అయితే ఇప్పుడు మాత్రం దానం నాగేందర్ ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేయకుండానే ఎంపీగా బరిలో దిగుతానని అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది.

దాంతో అధిష్టానం దానం పై గుస్సా అవుతున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఒకవేళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోతే ఎంపీ టికెట్ ఇవ్వమని ఏఐసిసి తేల్చి చెప్పినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిని కూడా మార్చే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో దానం స్థానంలో మరోసారి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అన్నదానిపై మరోసారి ఆసక్తికర చర్చ మొదలయ్యింది. ఇదిలా ఉంటే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. దానం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కోర్టుకు వెళతామని.. కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: