మల్లేల రాజేష్ నాయుడు 2019 ఎన్నికలకు ముందు వరకు టీడీపీలోనే ఉన్నారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చిలకలూరిపేట ఏఎంసీ చైర్మన్ గా కూడా వ్యవహరించారు. గత ఎన్నికలకు ముందు ఆయన వైసీపీ కండువా కప్పుకున్నా ఆయనకు వైసీపీ ప్రభుత్వంలో ఒరిగిందేమి లేదు. ఇక విడదల రజనీ మంత్రి పదవి వచ్చాక కూడా రాజేష్ నాయుడికి ఆ పదవి ఈ పదవి ఇస్తానని చెప్పి ఇవ్వలేదు.
ఆమెను జగన్ గుంటూరు వెస్ట్ సీటుకు మార్చాక రాజేష్ నాయుడికి చిలకలూరిపేట ఇన్‌చార్జ్ పగ్గాలు ఇచ్చారు. ఆయనే అక్కడ వైసీపీ ఎమ్మెల్యే క్యాండెట్ అనుకున్నారు. అయితే రజనీ రాజేష్‌కు సీటు ఇప్పించేందుకు రు 6.5 కోట్లు తీసుకున్నట్టు కూడా ఆయన ఆరోపించారు. కట్ చేస్తే రెండు నెలలు కూడా కాకుండానే రజనీపై, సజ్జల రామకృష్ణా రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసిన రాజేష్ నాయుడు ని ఇన్‌చార్జ్ పదవి నుంచి తప్పించారు.
తాజాగా ఈ రోజు ఆయన వైసీపీ లోని ముఖ్య నాయకులతో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ సీటు ఇవ్వగానే ఉత్సాహంగా పోటీ చేద్దామనుకున్న మల్లెల రాజేష్ నాయుడుకు గ్రౌండ్ రియాలిటీ అర్థం అయ్యిందని.. అందుకే ఆయన సీటు వద్దనే ఇప్పుడు టీడీపీలో జంప్ చేశారని అంటున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో ఆయన తెలుగుదేశం పార్టీ లో చేరారు.