
2009లో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసిన పీజీ సత్యనారాయణ ఇక్కడ విజయం సాధించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గుడివాడ అమర్నాథ్ ఇక్కడ విజయం సాధించారు. టిడిపి నుంచి పోటీ చేసిన పీలా గోవిందపై విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎంతోమంది రాష్ట్రంలో ఏర్పడిన మంత్రివర్గంలో మంత్రులుగా పని చేశారు.
గతంలో దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణ, గంటా శ్రీనివాసరావు మంత్రులుగా పని చేయగా, గడిచిన ఎన్నికల్లో ఎక్కడి నుంచి విజయం సాధించిన గుడివాడ అమర్నాథ్ కూడా మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అభ్యర్థిగా కొణతాల రామకృష్ణ బరిలోకి దిగారు. అధికార వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి అమర్నాథ్ ను తప్పించి మలసాల భరత్ కుమార్ అనే కొత్త వ్యక్తిని వైసీపీ బరిలోకి దించింది. ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారన్న ఆసక్తి నెలకొంది.
అయితే, కొన్నేళ్లుగా ఉత్తరాంధ్ర పేరుతో స్థానిక సమస్యలపై రామకృష్ణ ఉద్యమిస్తున్నారు. దీంతో ఆయనవైపు ఎక్కువగా మొగ్గు చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి తోడు.. పవన్ చరిష్మా కూడా తోడు అవుతుందని అంటున్నారు. అయితే.. వైసీపీ పథకాలు, ఇక్కడి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను భరత్ ప్రచారం చేస్తున్నారు. దీంతో ఇక్కడ ఆయన కూడా భారీగా విజయం పై అంచనాలు పెట్టుకున్నారు. కొణాతాలకు ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉండడం ఆయనకు ప్లస్ అయితే.. తనసొంత నియోజకవర్గంలో వైసీపీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకోవాలని మంత్రి అమర్నాథ్ ప్రచారం చేస్తున్నారు. దీంతో పోరు హోరాహోరీగా సాగనుందని తెలుస్తోంది.