ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ మితిమీరుతోంది. అవును, ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గం రాజకీయం ఓ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. సాధారణంగా ఎన్నికల వేళ, అభ్యర్ధుల పరస్పర విమర్శలు... సవాళ్లు షరా మామ్మూలే. అదేవిధంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేయబోయే పనులపై కూడా తెగ హామీలు ఇచ్చేస్తూ వుంటారు. అదంతా ఒకెత్తయితే ప్రస్తుతం బనగానపల్లె నియోజకవర్గం టీడీపీ అభ్యర్ధి బీసీ జనార్ధనరెడ్డి అయితే సొంత డబ్బుతో అక్కడ అభివృద్ధి చేస్తానని కోట్ల రూపాయాల హామీలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా తాను మాటమీద నిలబడే మనిషినని పదేపదే ప్రకటిస్తున్నారు.
ఈ తరుణంలో వైసీపీ అభ్యర్ధి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అసలు రూపాయి ఖర్చు పెట్టకుండా గెలిచే దమ్ముందా మీకు? అంటూ జనార్ధనరెడ్డికి సవాళ్లు విసురుతూ బనగానపల్లి రాజకీయాల్లో సెగలు పుట్టిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో ముందు నుంచి వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బి.సి.జనార్ధన్‌రెడ్డిల మధ్య వాడివేడిగా పొలిటికల్ వార్ నడుస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో అది కాస్త తీవ్రరూపం దాల్చేటట్టు కనబడుతోంది. గత అయిదేళ్ల నుంచి అధికారపక్షం ఎమ్మెల్యేగా అటు పార్టీ, ఇట ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చిన కాటసాని, ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్నారు.
వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమనే నమ్మకంతో కాటసాని రామిరెడ్డి ఉండగా టీడీపీ అభ్యర్ధి బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ కార్యక్రమాలను విజయవంతం చేస్తూ పార్టీని బలోపేతం చేయడంతో తనకు గెలుపు ఖాయమనే ధీమా వ్యక్తం చేస్తున్నారాయన. 2009లో కాటసాని పీఆర్పీ అభ్యర్ధిగా బనగానపల్లి నుంచి గెలిచి.. తర్వాత జగన్ బాట పట్టినసంగతి విదితమే. 2014లో బీసీ జనార్ధనరెడ్డి చేతిలో పరాజయం పాలై.. గత ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు. టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి ఈసారి జరగబోయే ఎన్నికల్లో కచ్చితంగా గెలుపు తనదేనని.. ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతే తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేయడం కొసమెరుపు.