- 2019లో ఆమంచి, మ‌ద్దిశెట్టిని వాడుకుని ఇప్పుడు వ‌దిలేసిన జ‌గ‌న్‌
- చీరాల వాసి ఎడం బాలాజీకి ఓడిపోయే ప‌రుచూరు సీటు
- జ‌న‌సేన + టీడీపీ పొత్తుతో జిల్లా బ‌లిజ కాపులంతా కూట‌మికే స‌పోర్ట్‌

( ప్ర‌కాశం జిల్లా ఇండియా హెరాల్డ్ ప్ర‌త్యేక ప్ర‌తినిధి )
2019 ఎన్నిక‌ల్లో కాపులు, కాపుల్లో ఉప‌కులాల‌కు చెందిన బ‌లిజ‌, ఒంట‌రి, తెల‌గ కులాల వారు కూడా త‌మ కులానికే చెదిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేసినా కూడా మెజార్టీ కాపులు అంద‌రూ వైసీపీకే ఓట్లు వేశారు. కాపులు బ‌లంగా ఉన్న గోదావ‌రి, ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో కూడా జ‌గ‌న్ పార్టీ అభ్య‌ర్థులు భారీ మెజార్టీల‌తో గెల‌వ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. మ‌రీ ముఖ్యంగా రెడ్డి, క‌మ్మ సామాజిక వ‌ర్గాల ప్రాబ‌ల్యం ఎక్కువుగా ఉండే ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో గ‌తంలో ఏ రాజ‌కీయ పార్టీ చేయ‌ని డేరింగ్ జ‌గ‌న్ చేశారు.


ద‌ర్శి, చీరాల రెండు సీట్ల‌ను బ‌లిజ వ‌ర్గానికే చెందిన మ‌ద్దిశెట్టి వేణుగోపాల్‌, ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌కు ఇచ్చారు. ఎన్నిక‌ల్లో ఆమంచి ఓడిపోయారు. మ‌ద్దిశెట్టి గెలిచినా ద‌ర్శిలో ఆయ‌న్ను ఐదేళ్ల పాటు డ‌మ్మీని చేసేశారు. మాజీ ఎమ్మెల్యే బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్ రెడ్డికి ప్ర‌యార్టీ ఇచ్చారు. త‌ర్వాత శివ‌ప్ర‌సాద్ త‌ల్లి వెంకాయ‌మ్మ‌ను జ‌డ్పీచైర్‌ప‌ర్స‌న్ చేశారు. ఇక ఇప్పుడు ఏకంగా సీటు ఎగ్గొట్టేశారు.


ఇక చీరాల‌లో పార్టీలతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్‌గా గెలిచిన ఆమంచి ఓడిపోయినా చీరాల‌లో ఆయ‌న‌కు ఉన్న ప‌ట్టు త‌గ్గ‌లేదు. ఆ త‌ర్వాత టీడీపీ నుంచి గెలిచిన క‌ర‌ణం బ‌ల‌రాం వైసీపీ చెంత చేర‌డంతో ఆమంచిని జ‌గ‌న్ ప‌రుచూరుకు పంపారు. అయితే త‌న సొంత సీటు వ‌దులుకుని ప‌రుచూరులో పోటీ చేయ‌డం ఇష్టం లేని ఆమంచి ఇస్తే చీరాల సీటు ఇవ్వండి.. లేక‌పోతే లేద‌న్న‌ట్టుగా చెప్పేశారు.


ఇక చీరాల‌లో 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి మూడో స్థానంతో స‌రిపెట్టుకున్న ఎన్నారై ఎడం బాలాజీని ఇప్పటికిప్పుడు ప‌రుచూరుకు దిగుమ‌తి చేశారు. అస‌లు అక్క‌డ ఊరు పేర్లు కూడా బాలాజీకి తెలియ‌వు. అన్ని స‌ర్వేల్లోనూ ఇది వైసీపీ ప‌క్క‌గా ఓడిపోయే సీటు అనే చెపుతున్నారు. దీనిని బ‌ట్టి బ‌లిజ నేత‌ల‌ను జ‌గ‌న్ ఎలా బ‌లి చేస్తున్నారో అన్న అస‌హ‌నం ఆ పార్టీ నేత‌ల్లోనే వినిపిస్తోంది.


ఇక బ‌లిజ‌లు ఎక్కువుగా ఉన్న గిద్ద‌లూరు సీటులో ఆర్య వైశ్య వ‌ర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నా రాంబాబును జ‌గ‌న్ మార్చారు. ఇక్క‌డ అయినా త‌మ‌కు సీటు ఇస్తార‌ని బ‌లిజ‌లు ఆశలు పెట్టుకుంటే దానిని త‌న రెడ్డి వ‌ర్గానికి చెందిన మార్కాపురం ఎమ్మెల్యేకు క‌ట్ట‌బెట్టారు. ఇలా ఓవ‌రాల్‌గా జ‌గ‌న్‌ను తాము న‌మ్మి గ‌త ఎన్నిక‌ల్లో వ‌న్‌సైడ్‌గా ఓట్లేస్తే ఇప్పుడు ఇలా త‌మ‌ను అవ‌మానిస్తార‌నుకోలేద‌న్న చ‌ర్చ‌లే జిల్లా బ‌లిజ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే వీరంతా ఈ సారి మెజార్టీ కూట‌మి వైపు మొగ్గు చూపుతోన్న ప‌రిస్థితే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: