జరగబోయే పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార మరియు ప్రతిపక్ష పార్టీలు ప్రచార దూకుడును పెంచేసాయి. ప్రచారంలో భాగంగానే నరసరావుపేట పార్లమెంట్ స్థానానికి టీడీపీ నుండి లావు శ్రీకృష్ణదేవరాయలు అలాగే వైసీపీ తరపున అనిల్ కుమార్ యాదవ్ బరిలో దిగనున్నారు. అయితే అందులో ఒకరు మాస్ ఇంకొకరు క్లాస్ ఒకరు మీసం తిప్పి తొడకొడితే ఇంకొకరు అందరికి నమస్కారం పెడుతూ ముందుకు పోతుంటారు. ఒకరు గ్రామ సభల్లో అనర్ఘళంగా మాట్లాడితే,ఇంకొకరు కార్నర్ మీటింగ్స్‌లో తనదైన శైలిలో హితబోధ చేస్తుంటారు.

అయితే ఈ ఇద్దరూ నేతలు కూడా రానున్న ఎన్నికల్లో ఢీ అంటే ఢీ అంటున్నారు. పల్నాడు జిల్లాలో ఇద్దరి నేతల విలక్షణ శైలే ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారింది.అనిల్ కమార్ యాదవ్ ఆయన దూకుడైన రాజకీయాలకు పెట్టింది పేరు. నెల్లూరు జిల్లా నుండి ఇక్కడికి వచ్చినా గట్టిగా మాట్లాడటమే కాదు అదే స్థాయిలో ఇక్కడి ప్రత్యర్ధులపై విరుచుకుపడుతుంటారు. మొదటిసారి నర్సరావుపేట స్థానం నుండి పోటీ చేస్తున్న అనిల్ కుమార్ యాదవ్ మొదటి రోజే తనకు ఇష్టమైన ప్రాంతం పల్నాడని ఇక్కడ నుండి పోటీ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ పల్నాడు ప్రాంతంలో మీసం తిప్పి తొడకొట్టవచ్చని అయితే నెల్లూరులో అలా చేస్తే రౌడీ అంటారని, ఇక్కడ మాత్రం తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు.

మరోవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు గ్రామాల్లో పర్యటిస్తున్న అనిల్ అటు టిడిపి నేత చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తనకున్న వాగ్ధాటితో పల్నాడు వాసులకు చాలా దగ్గర అవుతున్నారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలు కూడా అనిల్ ను శ్రీకృష్ణుడిగా సంబోధిస్తూ రథంపై ఊరేగిస్తున్నారు.

ఇకపొతే తెలుగుదేశం పార్టీప అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్న శ్రీక్రిష్ణ దేవరాయలు క్లాస్ టచ్‌తో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. గత ఐదేళ్ల పాటు నియోజకవర్గంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేసిన శ్రీక్రిష్ణ దేవరాయలు అదే జోరు కొనసాగాలంటే తనకే ఓటువేసి గెలిపించాలని అంటున్నారు. శ్రీక్రిష్ణ దేవరాయలు వ్యవహర శైలి అనిల్ కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఆయన వేదికలపై స్పష్టంగా మాట్లాడగలరు కానీ, మాస్‌ను ఆకట్టుకునే పంచ్ డైలాగులు ఆయన వేయలేరు. తాను చేసింది చేయబోయేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలిగే ఎంపీ.దాంతో పల్నాడు వాసులు వీరిద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్ ను పోల్చి చూసుకుంటున్నారు. ఇప్పటి వరకూ ఒకరిపై మరొకరు నేరుగా విమర్శులు మాత్త్రం చేసుకోలేదని తమ విజయానికి సహకరించాలని ప్రజలకు మాత్రం విజ్ఞప్తి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: