ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎన్నికల హడావుడి నడుస్తుంది.. ఈ సారి అధికారం ఎవరికీ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించి నిత్యం ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రజలకు ఊహించని హామీలిస్తూ హోరా హోరి గా ప్రచారం కొనసాగిస్తున్నారు.. దీనితో  ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అందులోను నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో రాజకీయాలు మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.గతంలో కేంద్ర మాజీ మంత్రి మరియు మాజీ ఉప రాష్ట్రపతి అయిన ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉదయగిరి ఎమ్మెల్యేగా రెండుసార్లు పనిచేసారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత  జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ ఉదయగిరి నియోజకవర్గంలో ప్రభంజనం సృష్టించారు. ఈ నియోజకవర్గంలో  మేకపాటి కుటుంబం కూడా ఉదయగిరి రాజకీయాలను శాసించింది.

1983లో వెంకయ్యనాయుడు చేతిలో ఓడిపోయినా కూడా 1985లో మళ్లీ పోటీచేసి మేకపాటి రాజమోహన్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన సోదరుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి 2004, 2009, 2012(ఉప ఎన్నికలు) అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. 2014 లో టిడిపి చేతిలో ఓడిన ఆయన మళ్ళీ 2019లో వైసిపి తరపున పోటీచేసి అద్భుత విజయం సాధించారు.అయితే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి ఎమ్మెల్యేలు కొందరు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు.దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి విజయం సాధించింది. ఇలా క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన వారిలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా వున్నారని వైసిపి అదిష్టానం నిర్దారించింది.

దీంతో వైసీపీ అధిష్టానం ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసింది.ఈ సారి ఎన్నికలలో ఆయన స్థానంలో మేకపాటి సోదరుడు అయిన రాజగోపాల్ రెడ్డిని బరిలోకి దింపింది. ఈసారి టీడీపీ తరుపున అధిష్టానం కొత్త అభ్యర్థి అయిన కాకర్ల సురేష్ ను ఉదయగిరి బరిలో నిలిపింది. గత ఎన్నికలలో ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి అయిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ అభ్యర్థి బొల్లినేని వెంకట రామారావుపై 36,528 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ సారి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఇక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కింది. దీనితో ఏ పార్టీ గెలుస్తుందా అనే విషయం ఆసక్తికరంగా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: