మరో వైపు తండ్రి టీజీ వెంకటేష్ ఒక పార్టీ, కుమారుడు టీజీ భరత్ మరో పార్టీలో కొనసాగుతుండటంతో పార్టీ శ్రేణుల్లో చాలా అయోమయం నెలకొంది. కూటమి ఏర్పడినా కూడా ఏరోజూ తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలసి ఆరోగ్యకరమైన వాతావరణంలో తిరిగిన దాఖలాలు లేవు అనేది సుస్పష్టం. టీజీ భరత్ ఒక్కరే సైకిల్ యాత్ర పేరుతో కాలనీలలో తిరుగుతున్నా స్పందన ఎలా వుందో అందరికీ తెలిసినదే. ఇపుడు ఇటువంటి అవకాశాన్నే అధికార పార్టీ వైసీపీ పార్టీ వినియోగించుకొనే పనిలో పడింది. కాగా ఇప్పటికే కర్నూలు నియోజకవర్గం నుంచి 2 సార్లు పోటీ చేసి తండ్రీ కుమారులు ఓడిపోయారు. ఇంకోవైపు ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న లక్కీ-2 కుటుంబం కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా మైనస్. ఇటువంటి తరుణంలో ఈ చర్యలు పార్టీ శ్రేణుల్లో ఒకింత గందరగోళానికి గురి చేస్తున్నాయి.
నగరంలోని ఎర్రబురుజు వద్ద కార్యకర్తలను కొంతమందిని పెట్టి పెద్ద ఎత్తున చీరలు పంపిణీ చేయాలని ప్లాన్ చేసుకున్నట్టు భోగట్టా. ఈ నేపథ్యంలోనే సమీపంలోని విక్టరీ థియేటర్‌లో చీరల మూటలు దాయడం జరిగింది. అయితే గుట్టుగా ఎర వేసి ఓట్లు కొల్లగొట్టేందుకు చేసిన టీడీపీ ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. కర్నూలు నియోజకవర్గ పరిధిలో ఎన్నికల కమిషన్ నియమించిన ఫ్ల్లయింగ్ స్క్వాడ్ అధికారులకు ముందస్తు సమాచారం రావడంతో విక్టరీ థియేటర్‌లో తెలుగుదేశం నాయకులు పెద్ద సంఖ్యలో మూటల మాటున దాచిన చీరలు బయట పడ్డాయి. ఇక్కడ మొత్తం 975 చీరలు స్వాదీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా భరత్ వార్డుల వారీగా కొంతమందిని చేరదీసి వార్డుల్లో ఇంటింటికీ డబ్బులు పంపిణీ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.