ఇక హరీష్ 2019 ఎన్నికల్లో కేవలం 25 వేల ఓట్ల తేడాతో ఓటమి చూశారు. ఒక పార్లమెంటు సీటులో 25వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం అంటే అందులోను తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవమే అయినా ఎంత గట్టి పోటీ ఇచ్చారో తెలుస్తోంది. కొందరు అసెంబ్లీ అభ్యర్థులు చేసిన మోసంతో క్రాస్ ఓటింగ్ జరగడంతోనే తాను ఓడిపోయానని తీవ్ర మనస్థాపానికి గురైన హరీష్ మూడేళ్ల పాటు నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. తర్వాత లోకేష్‌తో మాట్లాడి పరిస్థితి సెట్ చేసుకోవడంతో ఆయన మళ్ళీ రంగంలోకి వచ్చారు. ఇప్పుడు కూటమి అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. తండ్రి బాలయోగి బలమైన రాజకీయ వారసత్వం హరీష్ కు ఉన్నా.. సొమ్ములు లేకపోవడం మైనస్ గా మారింది.
గత ఎన్నికల్లో ఆయన ఇదే ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలోనే పార్లమెంటు పరిధిలో పోటీ చేస్తున్న ఏడు అసెంబ్లీ స్థానాలలో కొందరు అభ్యర్థులు డబ్బులు కోసం ఇతర పార్టీ నేతలతో ఒప్పందాలు చేసుకొని క్రాస్ ఓటింగ్ చేయిస్తున్నారని.. గత ఎన్నికల్లో హరీష్ స్వల్ప తేడాతో ఓడిపోవడానికి ఇదే కారణం అంటున్నారు. ఇక వైసీపీ నుంచి పోటీ చేస్తున్న రాపాక వరప్రసాద్ రావు రాజోలులో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు ఆర్థికంగా ఇబ్బందులు లేవు. దీనికి తోడు జగన్ నుంచి నిధులు గట్టిగా వస్తాయని ప్రచారం ఉంది. పైగా అమలాపురం పార్లమెంటు పరిధిలో వైసీపీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచే నాయకులు ఉన్నారు.
మండపేటలో తోట త్రిమూర్తులు, కొత్తపేటలో చర్ల జగ్గిరెడ్డి, అమలాపురంలో మంత్రి విశ్వరూప్, రామచంద్రపురంలో పిల్లి బోస్ కుటుంబం, ఇటు పి గన్నవరంలో జడ్పీ చైర్మన్ వేణుగోపాల్, ముమ్మిడివరంలో పొన్నాడ సతీష్ లాంటి సీనియర్ నేతలు ఆర్థికంగా బలమైన నేతలు ఉండటం వైసీపీ అభ్యర్థికి ప్లస్ కానుంది. ఇక హరీష్ కు రాజకీయ అనుభవం లేకపోయినా గత ఎన్నికల్లో ఓడిపోవడంతో పాటు అటు తండ్రి సానుభూతి కలిసి వస్తాయని చెబుతున్నారు. అయితే కూటమి ప్రభావం బలంగా ఉన్న పార్లమెంటు సెగ్మెంట్లలో అమలాపురం సెగ్మెంట్ కూడా ఒకటి. జనసేన, టీడీపీ ఈక్వేషన్ ఈ పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాలలో బలంగా కనిపిస్తోంది. మరి ఈ సమరంలో ఎవరు ? విజయం సాధించి అమలాపురం నుంచి పార్లమెంటులో అడుగు పెడతారో చూడాలి.