ఏపీ సీఎం, వైసీపీ అధినేత  జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌. ఇప్పుడు ఈ జిల్లాను వైసీపీ అధిష్ఠానం అష్ట‌దిగ్బం ధం చేసేసింద‌నే టాక్ వినిపిస్తోంది. నిజానికి గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఇప్పుడు క‌డప‌.. వైఎస్ జ‌గ‌న్ కు అత్యంత అగ్నిప‌రీక్ష‌గా మారిపోయింది. గ‌త ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా ఈ జిల్లా వైఎస్ కుటుంబానికి కంచుకోట మాత్ర‌మేకాదు.. శ‌త్రుదుర్భేధ్యం కూడా. పులివెందుల స‌హా.. అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో వైఎస్ కుటుంబానికి అత్యంత ఆధిప‌త్యం ఉంది. అలాంటి జిల్లాలో ఇప్పుడు వైఎస్ కుటుంబంలో ఏర్ప‌డిన చీలిక‌లు.. జ‌గ‌న్‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాయి.

ఏకంగా సీఎం జ‌గ‌న్ సోద‌రి.. వైఎస్ ష‌ర్మిల‌.. క‌డ‌ప ఎంపీగా పోటీచేస్తున్నారు. ఆమె కాంగ్రెస్ అభ్య‌ర్థిగా టికెట్ తెచ్చుకున్నారు. పైగా.. వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌.. సీఎం జ‌గ‌న్ పాల‌న వంటి అంశాల‌ను ఆమె తీవ్ర‌స్థాయిలో ప్ర‌చారం చేస్తున్నారు. ఎక్క‌డ నోరు విప్పినా.. నిప్పులు కురుస్తున్నాయి. దీంతో ఎంత క‌ర‌డు గ‌ట్టిన వైసీపీ నాయ‌కుడు అయినా..వైఎస్‌కుటుంబానికి విధేయుడు అయినా.. ఆలోచ‌న‌లో ప‌డుతు న్నాడు. ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉండ‌డంతో దీనిని మ‌రింత ముమ్మ‌రం చేసేందుకు ష‌ర్మిల ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇక‌, మ‌రోవైపు.. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో వివేకానంద‌రెడ్డి కుమార్తె.. డాక్ట‌ర్ సునీత మ‌రింత రెచ్చిపోతున్నారు. జ‌గ‌న్‌ను గ‌ద్దె దింప‌డం, క‌డ‌ప ఎంపీ అభ్య‌ర్థి అవినాష్‌రెడ్డిని ఓడించ‌డ‌మే  ల‌క్ష్యంగా సునీత కూడా పావు లు క‌దుపుతున్నారు. ఇద్ద‌రు మ‌హిళ‌లు.. పైగా వైఎస్ కుటుంబానికే చెందిన వారు కావ‌డంతో ఎంత లేద న్నా.. సింప‌తీ అయితే వ‌స్తుంది. మ‌రోవైపు..పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలోనూ విజ‌య‌మ్మ‌ను నిల‌బెడు తున్నార‌న్న వార్త‌హ‌ల్చ‌ల్ చేస్తోంది. చంద్ర‌బాబు కూడా ఇక్క‌డ ప‌రోక్షంగా అంతా న‌డిపిస్తున్నార‌న్న సందేహాలు ఉన్నాయి. దీంతో వైసీపీ అలెర్ట్ అయింది. క‌డ‌ప‌ను అష్ట‌దిగ్బంధం చేసేందుకు.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

కాంగ్రెస్ స‌హా టీడీపీ సానుభూతిపరులు, కీల‌క నాయ‌కుల‌ను పార్టీలోకి చేర్చుకునేందుకు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కు తెర‌దీసింది. తాజాగా రాయ‌చోటి టీడీపీ ఇంచార్జ్‌.. ర‌మేష్‌రెడ్డిని వైసీపీలో చేర్చుకునేందుకు ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈయ‌న‌కు ఎమ్మెల్సీ ఆశ చూపార‌ని తెలిసింది. ఈ రోజో రేపో ర‌మేష్‌రెడ్డి పార్టీ మార్పు ఖాయ‌మ‌ని అంటున్నారు.ఇక‌, మాజీ మంత్రి డీఎల్ ర‌వీంద్రారెడ్డిని కూడా... పార్టీలోకి చేర్చుకుం టున్నారు. దీనిపై చ‌ర్చ‌లు పూర్త‌య్యాయి.

ఇక‌, రాజంపేట నుంచి బ‌రిలో ఉన్న ఆదినారాయ‌ణ‌రెడ్డి కుటుంబానికి చెందిన కీల‌క నేత‌కు కూడా వైసీపీ గేలం వేసింది. ఇక‌, కాంగ్రెస్‌లో ఉన్న‌వారిని కూడా పార్టీలో చేర్చుకుంటున్నారు. సీమ‌కు చెందిన‌ న‌లుగు రు అత్యంత కీల‌క ఎంపీ అభ్య‌ర్థులు ఆ ఆప‌రేష‌న్‌ను నిశ్శ‌బ్దంగా ముందుకు తీసుకువెళ్తుండ‌డం గ‌మ‌నా ర్హం. త‌ద్వారా.. కడ‌ప‌ను రాజ‌కీయంగా అష్ట‌దిగ్బంధం చేసి.. త‌మ‌కు తిరుగులేద‌ని నిరూపించుకునే దిశ‌గా వైసీపీ అడుగులు వేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: