కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బొగ్గుల దస్తగిరి ప్రకటించిన ఆస్తుల వివరాలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. తన పేరిట ఉన్న చరాస్థుల విలువ 14 లక్షల రూపాయలు అని భార్య పేరిట 7 లక్షల రూపాయల ఆస్తులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తన చేతిలో ఉన్న నగదు కేవలం 10,000 రూపాయలు మాత్రమేనని బొగ్గుల దస్తగిరి వెల్లడించడం హాట్ టాపిక్ అవుతోంది.
ఆయన భార్య సుధారాణి దగ్గర మాత్రం 20,000 రూపాయల నగదు ఉందట. బొగ్గుల దస్తగిరి ఆస్తుల విలువ గురించి తెలిసి సామాన్యుడికి టికెట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడును ప్రశంసిస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున ఆదిమూలపు సతీష్ పోటీ చేస్తున్నారు. ఆదిమూలపు సతీష్ ఆస్తుల విలువ 24 కోట్ల రూపాయల 65 లక్షలు కాగా ఆయన భార్య పేరుపై 13 కోట్ల 7 లక్షల రూపాయల ఆస్తులు ఉన్నాయి.
బ్యాంక్ నుంచి 8.5 కోట్ల రూపాయల రుణం పొందినట్టు ఆయన నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. టీడీపీ సర్వేలలో సైతం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయిన కోడుమూరులో వైసీపీనే విజయం సాధిస్తుందని వెల్లడవుతుందగా ఎన్నికల ఫలితాలు సైతం అదే విధంగా ఉండబోతున్నాయో లేదో చూడాలి. గత కొన్నేళ్లుగా ఆశించిన స్థాయిలో కోడుమూరు నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు. ఈ ఎన్నికల్లో గెలిచే ఎమ్మెల్యే అభ్యర్థి అయినా కోడుమూరు అభివృద్ధి కోసం కృషి చేస్తారేమో చూడాల్సి ఉంది.