- భ‌ర్త ఎంపీగా... భార్య ఎమ్మెల్యేగా గెలిస్తే రేర్ రికార్డ్‌..!
- వ్యూహాత్మ‌క ప్ర‌చారంతో దూసుకుపోతోన్న ప్ర‌శాంతి
- సెంటిమెంట్ +  సేవా కార్య‌క్ర‌మాలతో భార్య‌, భ‌ర్త‌ల‌కు గుర్తింపు

( నెల్లూరు - ఇండియా హెరాల్డ్ )

అసలు ఎవరీ ప్రశాంతి... ఏ ఊరు... ఏం చేస్తారు... వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి... నిన్నటి వరకు వ్యాపార లావాదేవీల్లో బిజీబిజీగా గడిపేశారు. అధికారికంగా 715 కోట్ల విలువైన ఆస్తి. పలు సేవా సంస్థల ద్వారా ఎందరికో సాయం చేసిన చెయ్యి. నిన్నటి వరకు భర్త చాటు భార్య. కానీ ఈరోజు మాత్రం.. ఓ బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న నేతతో తలపడుతున్న అభ్యర్థి. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పోటీ చేస్తున్నారు. 1983 నుంచి టీడీపీ కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో కోవూరు ఒకటి. 2004, 2019 ఎన్నికల్లో మాత్రమే అక్కడ కాంగ్రెస్‌, వైసీపీ తరఫున నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గెలిచారు.


ఆయన కూడా 1994, 1999, 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. నల్లపురెడ్డి కోటగా కోవూరును మార్చేస్తా అంటున్న ప్రసన్నకుమార్‌ రెడ్డితో ప్రస్తుతం ప్రశాంతి రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆమెను విమర్శించేందుకు ఎలాంటి తప్పులు లేకపోవడంతో.. ఆమె రెండో వివాహంపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీనిపై కూడా చాలా సున్నితంగానే కౌంటర్ ఇచ్చారు ప్రశాంతి. భర్త మరణానంతరం కుటుంబ సభ్యుల సమ్మతితోనే  వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిని వివాహం చేసుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అదేమైనా తప్పా అంటూ ప్రశ్నించడంతో వైసీపీ నేతలకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.


కోవూరు నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటిస్తున్న ప్రశాంతి రెడ్డి... నియోజకవర్గంలో ఐదేళ్లల్లో జరిగిన అభివృద్ధి ఏమిటని సున్నితంగా ప్రశ్నిస్తున్నారు. నేను చెప్పటం కాదు... మీరే మీ సమస్యలు నాకు చెప్పండి... గెలిచినా.. గెలవకపోయినా... మీ సమస్య తీరుస్తా అంటూ ఇస్తున్న హామీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటికే వీపీఆర్ ఫౌండేషన్‌ ద్వారా సేవ కార్యక్రమాలు చేస్తున్న ప్రశాంతి చెబుతున్న మాటలు, ఇస్తున్న హామీలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


మీకు మంచి అనిపిస్తేనే ఓటు వేయండి అంటూ ప్రశాంతి ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. పార్టీ మారుతారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి కూడా వేమిరెడ్డి దంపతులు క్లారిటీ ఇచ్చేశారు. కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇలా ఫేక్ ప్రచారం చేస్తున్నారని... పార్టీ మారేది లేదని తేల్చి చెప్పేశారు. ప్రజలు వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు కూడా. ఇప్పటికే కోవూరు నియోజకవర్గంలోని 5 మండలాలను చుట్టేశారు ప్రశాంతి రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: