- మాజీ మంత్రి కొణ‌తాల రామ‌కృష్ణ‌తో వైసీపీ భ‌ర‌త్ ఢీ
- 40 ఏళ్ల అనుభ‌వం వ‌ర్సెస్ పొలిటిక‌ల్ ప‌సిబాలుడు
- కాపులు, గ‌వ‌ర్ల మ‌ద్ద‌తు ఎవ‌రికో...!

( ఉత్తరాంధ్ర - ఇండియా హెరాల్డ్ )

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన సీనియర్ వర్సెస్.. వైసీపీ జూనియర్ పోరు ఆసక్తికరంగా మారింది. పొత్తులో భాగంగా ఎన్డీయే నుంచి జనసేన అభ్యర్థి కొణ‌తాల రామకృష్ణ పోటీ చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థిగా ఇటీవల రాజకీయాల్లోకి వచ్చిన మలసాల భరత్ పోటీ చేస్తున్నారు. రాజకీయాల్లో రామకృష్ణకు సుదీర్ఘ అనుభవం ఉంది. కొండలాంటి కొణతాలను జూనియర్లైన భరత్ ఎలా ఎదుర్కొంటారు ? అనేది ఆసక్తిగా మారింది. విశాఖపట్నం నగరానికి అతి సమీపంలో ఉన్న అనకాపల్లి పట్టణం.. అభివృద్ధిలో వెనుకబడి ఉంది. 1878లోనే మున్సిపాలిటీగా అవతరించిన అనకాపల్లి.. 2017 లో గ్రేటర్ విశాఖలో విలీనమైంది.


క‌శింకోట‌, అన‌కాప‌ల్లి మండ‌లాల‌తో పాటు నియోజకవర్గంలో గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ పరిధి కూడా విస్తరించి ఉంది. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న ఈ నియోజకవర్గంలో రైతులు సమస్యలు చాలా ఉన్నాయి. అనకాపల్లికి ఘనమైన చరిత్ర ఉన్న అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయింది. 2019లో వైసీపీ నుంచి గెలిచిన గుడివాడ అమర్నాథ్.. జగన్ క్యాబినెట్లో ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇక్కడ అమర్నాథ్ మంత్రి అయిన ఆయన నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. ఈసారి అక్కడ ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉండటంతోనే ఆయనను గాజువాక కు షిఫ్ట్ చేసి.. ఇక్కడ నుంచి సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న జూనియర్ మలసాల భరత్ కు జగన్ సీటు ఇచ్చారు.


కశింకోట మండలానికి చెందిన భరత్ రాజకీయాలకు కొత్త. ఆయన కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్న భరత్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన అమెరికాలో పలు వ్యాపారాలు చేసి యేడాది క్రితం రాష్ట్రానికి వచ్చారు. గతంలో రాజకీయాల్లో లేకపోవడం యువకుడు కావడం ప్రజల్లో ఆయనపై ఎలాంటి వ్యతిరేకత లేకపోవడం.. భరత్ కు కలిసి వచ్చే అంశం. అయితే వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత, కూటమి ప్రభావం నియోజకవర్గంలో గట్టిగా ఉండటం ఆయనకు మైనస్. జనసేన అభ్యర్థి మాజీమంత్రి కొణ‌తాల రామకృష్ణ అనకాపల్లి ప్రజలకు 40 ఏళ్ళుగా తెలిసిన వ్యక్తి.


ఆయన ఎంపీగా, ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. పైగా టీడీపీ, బిజేపి, జనసేన కూటమి బలంగా ఉండటం.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆయనకు కలిసి రానున్నాయి. నియోజకవర్గం మొత్తం ఓట‌ర్ల‌లో.. 45% కాపు ఓటర్లు, 30% గ‌వ‌ర ఓట‌ర్లు ఉన్నారు. ఈ రెండు సామాజిక వర్గాలు ఎవరికి ? మద్దతు ఇస్తే వారిని విజ‌యం వ‌రించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌తో కాపుల్లో ఎక్కువ శాతం జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇక కొణ‌తాలకు తన సొంత సామాజిక వర్గం కలిసి రానుంది. ఏది ఏమైనా ఓవరాల్ గా చూస్తే ఇక్కడ భరత్ కంటే కొణతాలకు ఎక్కువ సానుకూలతలు కనిపిస్తున్న పరిస్థితి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: