గత ఎన్నికల్లో పవన్ ప్రభావం నిల్. పవన్ రెండు చోట్ల గాజువాక, భీమవరం పోటీ చేసినా రెండు చోట్లా కూడా ఓడిపోయారు. భీమవరంలో కనీసం రెండో ప్లేస్ లో అయినా ఉన్న పవన్ గాజువాకలో అయితే మూడో స్థానంతో సరి పెట్టుకుని పరువు పోగొట్టుకున్నాడు. ఈ సారి గత ఎన్నికల్లో ఓడిపోయిన భీమవరం , గాజువాక వదిలి పెట్టి ఈ సారి కాకినాడ జిల్లాలోని పిఠాపురం నుంచి పవన్ పోటీలో ఉన్నారు. అక్కడ వైసీపీ నుంచి ప్రస్తుత కాకినాడ ఎంపీ వంగా గీత పోటీ చేస్తున్నారు.
ఈ సారి జనసేన పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ సీట్లతో పాటు కాకినాడ, బందరు ఎంపీ సీట్లకు కూడా పోటీ పడుతోంది. జనసేన పోటీ చేస్తోన్న కాకినాడ, బందరు రెండు ఎంపీ సీట్లు ఇచ్చారు. రెండు ఎంపీ సీట్ల విషయంలో జనసేన గెలిచేందుకు సానుకూల పవనాలే కనిపిస్తున్నాయి. ఇక 21 ఎమ్మెల్యే సీట్ల విషయానికి వస్తే ఆ పార్టీ యలమంచిలి, పెందుర్తి , అనకాపల్లి , పిఠాపురం, పి. గన్నవరం, రాజోలు , తాడేపల్లి గూడెం, భీమవరం , నరసాపురం , అవనిగడ్డ , ఉంగుటూరు సీట్లలో గ్యారెంటీగా విజయం సాధించనుంది.
ఇక పోలవరం, రైల్వేకోడూరు , విశాఖ దక్షిణం, పాలకొండ సీట్లు గెలవడం కష్టంగానే కనిపిస్తోంది. అలాగే తిరుపతి, తెనాలి , రాజానగరం, కాకినాడ రూరల్ లాంటి చోట్ల గట్టి పోటీ తప్పేలా లేదు. తిరుపతిలో జనసేన నుంచి పోటీ చేస్తోన్న వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అరణి శ్రీనివాసుల తో పాటు తెనాలిలో పోటీ చేస్తోన్న జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ సైతం గట్టి పోటీ యే ఎదుర్కొంటున్నారు. ఇక నెల్లిమర్లలో జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్న లోకం మాధవి కూడా గట్టి పోటీలో ఉన్నారు. మరి ఈ అంచనాలు రేపటి ఎన్నికల రోజు న ఎలా మారతాయో ? చూడాలి.