ఎన్నికల సమయంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి మొన్నటి వరకు వైఎస్ వివేకా హత్య కేసు వ్యవహారంపై కడప లో రాజకీయ విమర్శలు హీటెక్కేవి. అయితే కడప కోర్టు ఆదేశాలతో ఆ విషయంపై విమర్శలు ఆగినా.. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి వ్యవహారం మాత్రం ఇంకా సంచలనంగానే ఉంది.

అయితే ఇప్పుడు ఆయన జైభీం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థగా బరిలో దిగుతున్నారు. సీఎం జగన్ పోటీ చేసిన స్థానం నుంచే బరిలో దిగడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకొంది.  ఐదేళ్ల క్రితం జరిగిన హత్య కేసులో నిందితుడు.. నేడు ఏకంగా పోలీస్ భద్రత నడుమ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగడంతో ఇప్పుడు ఆయన గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.

నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తనను నామినేషన్ వేయకుండా అడ్డుకునేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నించిందని.. తాను బరిలో నుంచి తప్పుకుంటే రూ.5 కోట్లు ఇస్తామని ఆఫర్ కూడా చేసిందని చెప్పుకొచ్చారు. పులి వెందుల సభలో సీఎం జగన్ ఇష్టానుసారంగా మాట్లాడారని.. వివేకాను ఎవరు చంపారో. ఎందుకు చంపించారో జగన్ కు తెలియదా అని ప్రశ్నించారు. ప్రలోభాలు, బెదిరింపులను లెక్క చేయకుండా జగన్ ను ధీటుగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.

నేను హత్య చేశాను. కానీ ధర్మం కోసం కట్టుబడ్డాను ఇది దస్తగిరి అనుసరిస్తున్న వ్యవహార శైలి. హత్య చేసింది డబ్బుల కోసం. కానీ వివేకా హత్య జరిగిన తర్వాత ఇవ్వాల్సిన డబ్బులను ఎర్ర గంగిరెడ్డి ఇవ్వలేదు. అప్పటి నుంచి ఆ డబ్బులను సంపాదించుకునేందుకు రాజకీయాలను వాడుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇది పక్కన పెడితే.. ఇంతకీ దస్తగిరి కి వైసీపీ నాయకులు రూ.5 కోట్లు ఎందుకు ఆఫర్ చేస్తారు. అసలు కడపలో జగన్ ను ఎదుర్కొని గెలిచే సత్తా దస్తగిరికి ఉందా.  మొత్తానికి నా రేటు ఇది అని చెప్పకనే చెబుతున్నారా అనేది ఎవరికీ అర్థం కావడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: