* ఆధిపత్య పోరులో ఎవరిది పై చేయి కానుంది
* పెద్దారెడ్డి వర్సెస్ అస్మిత్ రెడ్డి
(అమరావతి - ఇండియా హెరాల్డ్)
ఆంధ్రప్రదేశ్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు కేవలం 14 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఎవరికి వారు అధికారంలోకి రావడానికి ప్రజలతో మమేకం అవుతూ.. ఇప్పటివరకు తాము చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ మరికొంతమంది.. తాను అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తామో చెబుతూ.. ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.. ఇక అందులో భాగంగానే ఒకే సామాజిక వర్గంలో ఉండే నేతల మధ్య పోటాపోటీ రసవత్తరంగా సాగుతోంది.. ప్రత్యేకించి కొన్ని ప్రాంతాలలో అటు టిడిపి , ఇటు వైసిపి తరఫున రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు పోటీ పడుతూ ఉండడం వార్ కి దారి తీస్తోందని చెప్పవచ్చు.
ఇక ఈ నేపథ్యంలోనే రాయలసీమ అనంతపురంలోని తాడిపత్రి నియోజకవర్గంలో రెడ్డి వర్సెస్ రెడ్డి మధ్య పోరు చర్చనీయాంశంగా మారింది.. ఫ్యాక్షనిజం కు కేరాఫ్ అడ్రస్ గా మారిన తాడిపత్రిలో .. రెడ్ల మధ్య జరిగే పోటీలో గెలుపు ఎవరిది? ఎవరు ప్రజల మన్ననలు దక్కించుకొని అధికారంలోకి వస్తారు? అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది . మరోవైపు వైసీపీ తరఫున పెద్దారెడ్డి పోటీ చేస్తుండగా.. టిడిపి తరఫున జే.సీ.అస్మిత్ రెడ్డి ఢీ కొట్టడానికి సిద్ధమయ్యారు.. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేగా పెద్దారెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారా? లేక గత ఎన్నికల్లో ఓడిపోయిన అస్మిత్ రెడ్డి ఈసారి అసెంబ్లీలో అడుగు పెడతారా ? అన్న విషయాలు చర్చనీయాంశంగా మారాయి.. మరి ఈ ఫ్యాక్షన్ గడ్డపై గెలుపు ఎవరిదో రాజకీయ విశ్లేషకులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..
రాష్ట్ర రాజకీయాలలో తాడపత్రి కి ఒక ప్రత్యేక స్థానం ఉంది.. ఈ నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పుడు ఉత్కంఠ రేకేత్తిస్తూనే ఉంటాయి. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న కుటుంబ ఆధిపత్యానికి 2019 ఎన్నికల్లో బ్రేక్ పడింది. అప్పటినుంచి ఇక్కడ రాజకీయాలు మరింత వేడెక్కాయి. తాడిపత్రి ఒకవైపు వ్యవసాయం మరొకవైపు పారిశ్రామికంగా కూడా బాగానే అభివృద్ధి చెందింది. ఎన్నో ఏళ్లుగా టిడిపి కంచుకోటగా కొనసాగుతున్న తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి 2019లో అధికారంలోకి వచ్చి కంచుకోట ను ఢీ కొట్టారు. ఫ్యాక్షన్ నేపథ్యమున్న కుటుంబాలలో జెసి దివాకర్ రెడ్డి, కేతిరెడ్డి కుటుంబాల మధ్య ఆదిపత్య పోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రాజారెడ్డి కాలం నుంచే రెండు కుటుంబాల మధ్య వైరం కొనసాగుతోంది.
అయితే 2019లో అధికారంలోకి కేతిరెడ్డి కుటుంబం వచ్చిన తర్వాత జెసి దివాకర్ రెడ్డి కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి.. ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి.. వాహనాలు అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో జైలుకు వెళ్లడం.. వచ్చిన తర్వాత 60 వరకు కేసులు ఎదుర్కొన్నారు. అదే సమయంలో జెసి దివాకర్ రెడ్డి అనుచరులు పెద్దారెడ్డి పై చేస్తున్న దాడికి తట్టుకోలేక పెద్దారెడ్డి నేరుగా జెసి దివాకర్ రెడ్డి కుటుంబాన్ని అటాక్ చేశారు.. అప్పట్లో ఈ విషయం మరింత సంచలనంగా మారింది. ఇక అదే సమయంలో జెసి దివాకర్ రెడ్డి తాడిపత్రిలో పూర్తి ప్లాట్ఫారం వేసుకునేందుకు ప్రయత్నం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికలు జరగగా వార్డు మెంబర్గా పోటీ చేయడమే కాదు మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ ఖాతాలో వేశారు. ఇది అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనం సృష్టించింది. జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి పెద్దారెడ్డిని, వైసీపీని టార్గెట్ చేస్తూ దివాకర్ రెడ్డి పూర్తిస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. కానీ పెద్దారెడ్డి మాత్రం పాదయాత్ర చేసి ప్రజలలో మన్ననలు పొందే ప్రయత్నం చేశారు.. మరొకసారి టికెట్ సాధించి రేసులో నిలబడ్డారు. జెసి కుటుంబాన్ని ఢీకొట్టేది పెద్దారెడ్డి మాత్రమే అనేలా పేరు సంపాదించారు.
టిడిపి విషయానికి వస్తే గత ఎన్నికల్లో జేసీ అస్మిత్ రెడ్డి పోటీ చేశారు. ఇప్పటికీ ఆ నియోజకవర్గ ఇన్చార్జి ఆయనే.. ఈసారి కూడా టిడిపి తరఫున బరిలోపు దిగుతున్నారు. తాము ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండబోమని జేసీ బ్రదర్స్ చెప్పినా.. అసెంబ్లీ ఎన్నికల్లో అనుకోని ఓటమి ఎదురవడంతో మళ్లీ ప్రభాకర్ రెడ్డి ఆక్టివ్ అయ్యారు. అస్మిత్ రెడ్డి ఆయన తండ్రి.. యువ చైతన్య బస్సు యాత్ర పేరుతో నియోజకవర్గాన్ని చుట్టేశారు. ఇన్ని ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా జేసీ ఫ్యామిలీ గ్రామ గ్రామాన తిరుగుతున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి పై విమర్శలే బలమైన ఆయుధంగా మార్చుకొని వారు ముందుకు సాగుతున్నారు.. ప్రస్తుతం తాడిపత్రిలో ఈ రెండు కుటుంబాలకే ప్రాముఖ్యత ఉంది..
ఇక కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను గ్రామ గ్రామంలో ఇంటింటికి అందేలా చేశారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత తాడిపత్రి పురపాలక సంఘం గాడిలో పెట్టారు. అయితే జెసి ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య ఉన్న గొడవల వల్ల అభివృద్ధి అంతంత మాత్రం గానే సాగిందని ప్రజలు చెబుతున్నారు. రెడ్ల మధ్య ఉన్న ఆధిపత్య పోరులో గతంలో ఉన్నంత స్వచ్ఛత ఇప్పుడు కనిపించడం లేదు. ప్రత్యేక మార్కు లేకపోయినా ప్రజలలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు పెద్దారెడ్డి. తెలుగుదేశం హయాంలో పెండింగ్లో ఉన్న వంద పడకల ఆసుపత్రిను కూడా పెద్దారెడ్డి పూర్తి చేశారు. ప్రభుత్వ కార్యాలయాల భవనాలను శరవేగంగా పూర్తి చేయడంలో ముందు నిలిచారు. గత ఎన్నికల్లో కేవలం 7000 ఓట్ల మెజారిటీతో మాత్రమే పెద్దా రెడ్డి గెలుపొందారు.. మరి ఇప్పుడు రెడ్డి వర్గ పోరులో ఎవరు గెలుస్తారు అన్నది ప్రజలలో కూడా సందిగ్ధత నెలకొంది.