- మంత్రి పదవి పోయాక పూర్తిగా ప్రజలకు దూరం
- అన్న బుజ్జి వారసత్వానికి బలమైన పునాది వేసిన చంటి..!
( గోదావరి - ఇండియా హెరాల్డ్ )
ఏలూరు జిల్లా కేంద్రమైన ఏలూరులో టీడీపీ, వైసీపీ రెండు పక్షాల నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన వారే పోటీపడుతున్నారు. గత మూడు, నాలుగు ఎన్నికలలో ఇదే పరిస్థితి కొనసాగింది. వైసీపీ నుంచి మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల నాని మరోసారి పోటీలో ఉన్నారు. టీడీపీ నుంచి దివంగత మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి సోదరుడు చంటి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికలలో ఇక్కడ జనసేన నుంచి పోటీ చేసిన రెడ్డి అప్పలనాయుడు కు 17వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. ఈసారి కూటమి అభ్యర్థిగా చంటి పోటీలో ఉండడంతో ఇక్కడ బలంగా ఉన్న జనసేన ప్రభావం చంటికి కలిసి వస్తోంది.
జనసేన, బీజేపీ, టీడీపీ ఓటు బ్యాంకుతో పాటు అర్బన్ లో ప్రభుత్వం పై ఉన్న తీవ్ర వ్యతిరేకత.. దీనికి తోడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల నాని గత మూడేళ్లుగా అసలు ప్రజల మధ్యకే రాకపోవటం.. ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడం.. ఇవన్నీ వైసీపీకి చాలా పెద్ద మైనస్ గా కనిపిస్తున్నాయి. ఒకానొక టైంలో జగన్ సైతం ఆళ్ళ నానికి సీటు ఇస్తే ఓడిపోతుందన్న నివేదికలు చూసి ఆయనను పక్కన పెట్టాలని అనుకున్నారు. అయితే చివరి క్షణంలో ఆళ్ళ నాని కంటే మంచి అభ్యర్థి దొరకకపోవడంతో ఆయననే కంటిన్యూ చేస్తున్నారు. ఏలూరులో వైసీపీ గెలుస్తుంది అన్న నమ్మకాలు స్థానికంగా పార్టీ క్యాడర్‌కు.. అటు అధిష్టానానికి కూడా లేవని చెప్పాలి.
జగన్ ప్రభుత్వంలో తొలి మూడేళ్లలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగాను, ఇటు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆళ్ళ నాన్ని ఏలూరు నియోజకవర్గానికి చేసింది ఏమి లేదన్నది వాస్తవం. తనను మూడుసార్లు గెలిపించినందుకు పైగా చేతిలో మంత్రి పదవి ఉన్నందుకు ఆళ్ళ నాని ఏలూరులో తిరుగులేని అభివృద్ధి చేసి చూపించాలి. అభివృద్ధి ఏమీ జరగలేదన్న అసంతృప్తితో పాటు.. అసలు ఎమ్మెల్యే తమను కలిసేందుకు కూడా బయటకు రావడం లేదన్న ఆగ్రహం స్థానికంగా ప్రజల్లో కనిపిస్తోంది.
ఆళ్ళ నాని నియోజకవర్గం ప్రజలకు కాదు కదా.. కనీసం తమ సొంత పార్టీ నేతలు.. కార్పొరేటర్లకు కూడా దర్శన భాగ్యం లేకుండా చేసుకున్నారు అంటే ఆయనపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో ? తెలుస్తోంది. ఇక టీడీపీ అభ్యర్థి బడేటి బుజ్జి స్వతహాగా సౌమ్యుడు.. ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఎవరిని తన దగ్గరకు పదేపదే తెప్పించుకోకుండా తన వల్ల అయ్యే పని అయితే వెంటనే చేయటం.. లేకపోతే ఇది మన ప్రభుత్వం వచ్చాక చేస్తాను అని చెప్పటం జరుగుతోంది. నాని కంటే చంటి కి ప్రజలతో అటాచ్మెంట్ బాగుందన్న చర్చ కూడా మొదలైంది. ఏది ఏమైనా ఏలూరులో ఈసారి బడేటి చంటి టీడీపీ జెండా ఎగరేయటం ఖాయం అన్నదే బాగా వినిపిస్తోంది.