ఎన్నికలవేళ ఏపీ రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. మాజీ మంత్రి వివేకా హత్య కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లిన తర్వాత దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబం రెండు వర్గాలుగా చీలిపోయిన సంగతి అందరికీ తెలిసినదే. అన్న చెల్లెల్లు సీఎం జగన్‌, షర్మిల 2 వర్గాలుగా విడిపోయి సార్వత్రిక ఎన్నికల్లో పోటీపడుతుండడం ఇపుడు చాలా ప్రత్యేకతని సంతరించుకుంది. ఇదే అదనుగా చేసుకొని తండ్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో ఐదేళ్లుగా న్యాయం జరగలేదని, అందుకు జగనే కారణమంటూ ప్రజాక్షేత్రంలోకి షర్మిలతో కలిసి సునీత దిగడం స్టోరీ చాలా రసవత్తరంగా మారింది. ఈ క్రమంలో కడప పార్లమెంటు స్థానానికి షర్మిల కాంగ్రెస్‌ పార్టీ నుంచి తలపడుతుండగా, వైకాపా నుంచి సీఎం జగన్‌.. వైఎస్‌ అవినాష్‌రెడ్డిని రంగంలోకి దింపారు.

ఇకపోతే బాబాయ్ హత్య కేసులో A1 నిందితుడిగా ఉన్న అవినాష్‌రెడ్డికి కొమ్ము కాయడమే కాకుండా తిరిగి అభ్యర్థిగా రంగంలోకి దింపడాన్ని సునీత, షర్మిల అస్సలు జీర్ణించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే అన్న జగన్‌తో పాటు అవినాష్‌రెడ్డిని ఢీకొట్టడానికి ఇరువురు సిద్ధమయ్యారు. ఆ నియాజక వర్గానికి షర్మిలకు మద్దతుగా రాహుల్‌గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ వేర్వేరు సమయాల్లో ప్రచారానికి రానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే సునీత ఊరూవాడా ప్రచారం చేయడం మొదలు పెట్టగా తాజాగా షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌కుమార్‌ శనివారం నుంచి రంగంలోకి దిగి అందరికీ ఆశ్చర్యపరిచారు.

అవును, క్రైస్తవ మత ప్రచారకుడిగా పేరుతెచ్చుకున్న షర్మిల భర్త 'బ్రదర్‌' అనిల్‌ కుమార్‌ 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా తిరిగి వైకాపాకు మద్దతు ప్రకటించినట్టుగా ఇపుడు జగన్ కి వ్యతిరేకంగా ప్రచారం షురూ చేసారు. ఈ క్రమంలో షర్మిలకు మద్దతుగా వైయస్‌ఆర్‌ జిల్లాలో పాస్టర్లు, క్రైస్తవులతో సమావేశమవుతున్నారు. కడపలోని పలు చర్చిల్లో ఆదివారం జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొన్న ఆయన ధైర్యంగా ఉండాలని, పాపాత్ములని ఆ దేవుడే శిక్షిస్తాడని... ఈసారి ఓటు జగన్ లాంటి నీచుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకూడదని స్థానిక ప్రజలకు సూచిస్తున్నాడు. ఇకపోతే తన పార్టీ ఓట్లు చీలి పోతాయనే భయంతో ప్రత్యక్షంగా కాంగ్రెస్‌ పార్టీపైనా, పరోక్షంగా షర్మిలపై ఈ నెల 25న పులివెందుల సభలో సీఎం జగన్‌ బహిరంగంగా విమర్శలు చేసిన సంగతి విదితమే. కాగా సీఎం అనుమానాలు నిజం చేసేవిధంగా బ్రదర్‌ అనిల్‌కుమార్‌ క్రిస్టియన్‌, మైనారిటీ ఓటర్లను తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలు ముమ్మరం చేయడం కొసమెరుపు.

మరింత సమాచారం తెలుసుకోండి: