నెల్లూరు లోక్‌సభ, దాని పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను సునాయాసంగా క్లీన్ స్వీప్ చేయబోతోన్నామని, ఆ విశ్వాసంతో ఎన్నికలను ధీటుగా ఎదుర్కొంటోన్నామని సాయిరెడ్డి ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేయడంతో అక్కడున్న వైస్సార్సీపీ కార్యకర్తలు కరతాళ ధ్వనులు చేసారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం మెండుగా ఉందని, యూనిఫాం సివిల్ కోడ్‌ను తప్పకుండా అమలు చేస్తుందని విజయసాయిరెడ్డి అన్నారు. అదేవిధంగా ముస్లింలకు వ్యతిరేకంగా ఉండే ఈ సివిల్ కోడ్‌ను ఎన్డీఏ భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ సమర్ధిస్తుందా? లేదా? అని అనుమానంగా ఉందని అన్నారు. ఆ విషయంపై చంద్రబాబును పలుమార్లు ప్రశ్నించినా సరైన సమాధానం చెప్పలేదని అన్నారు.
ఇక యూనిఫాం సివిల్ కోడ్‌ను ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులు, బీసీలు సైతం వ్యతిరేకిస్తున్నారని, ఇలాంటి బిల్లును వైఎస్‌ఆర్సీపీ ఎట్టిపరిస్థితుల్లో సమర్థించదని కూడా సాయిరెడ్డి ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. కాగా ఈ యూనిఫాం సివిల్ కోడ్‌పై చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌తో పాటు బీజేపీ స్థానిక నాయకత్వం కలుపుకొని సూటిగా సమాధానం చెప్పి తీరాలని అడిగారు. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టోపై చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఫొటోలు మాత్రమే ఉన్నాయని, మిత్రపక్షమైన బీజేపీ సీనియర్ నాయకులు, ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో అస్సలు లేదని.. ప్రజలు గమనించాలని అన్నారు. ఇదంతా ముస్లిం సామాజికవర్గ ఓట్ల కోసమేనని.. మోదీ ఫొటో వాడితే ముస్లింలు తమకు ఓట్లు వేయరనే భయంతోనే చంద్రబాబు నడిపిస్తోన్న కుట్రగా అభివర్ణించారు సాయిరెడ్డి.