ఏపీలో ఎన్నికలకు ఇంకా 10 రోజులు మాత్రమే సమయం ఉన్నది. ఈ క్రమంలో విపక్షాలు తమ ప్రచారాలను వేగవంతం చేసాయి. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఎమ్మెల్యే కాటసానిపై తాజాగా తనదైన ఛలోక్తులతో విరుచుకు పడ్డారు. ఎన్నికల ముందు హామీలిచ్చి మాట తప్పుతూ, మడమ తిప్పడం అతని నైజం అంటూ విమర్శించారు. విషయం ఏమిటంటే, బుధవారం కొలిమి గుండ్ల మండలంలోని అంకిరెడ్డి పల్లె, కోరు మానుపల్లె, అబ్దులాపురం గ్రామాల్లో బీసీ జనార్దనరెడ్డి ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంగతి గురించి అందరికీ తెలిసినదే. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన నాయకులు మాజీ ఎమ్మెల్యే బీసీకి ఘన స్వాగతం పలకడం జరిగింది.

ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ... "ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఎన్నికల ముందు చాలా బుద్ధిమంతుడిలాగా మన దగ్గరకు వచ్చి రాయల్టీ చెక్‌పోస్టు ఎత్తివేస్తామని హామీ ఇవ్వబట్టే మీరు ఓట్లు కుమ్మరించారు కదా? కానీ మనోడు మాటతప్పి నాపరాతి పర్రిశమ వర్గాలను అత్యంత దారుణంగా మోసం చేయడం కళ్లారా చూశారు. అంతటితో ఆగలేదు. నాపరాయి పర్రిశమపై అనేక రకాల అదనపు పన్నులు మోపి, చిన్నకారు వ్యాపారులనుండి... పెద్దకారు వ్యాపారుల వ్యాపారాలను పోగొట్టడమే కాకుండా ఆఖరికి పర్రిశమను మొత్తాన్ని నాశనం చేసి పారేసారు. పోనీ సమస్యను కనీసం సిఎం దృష్టికి కూడా తీసుకెళ్లలేదు." అంటూ మండిపడ్డారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ... వైసీపీ హాయాంలో అస్సలు గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని, అందుకే వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. టీడీపీని గెలిపిస్తే సంక్షేమ పథకాలు ఇవ్వడమే కాదు రాష్ట్రాన్ని దేదీప్యమానంగా అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. పింఛన్‌ రూ.4వేలకు పెంచుతామని, అమ్మవడి ఇంట్లో అందరి పిల్లలకు ఇస్తామని, 3గ్యాస్‌ సిలిండర్లు ఉచితం, ప్రతి మహిళకు ఏడాదికి రూ.18వేలు, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం తదితర అనేక పథకాలు అందుతాయని ఈ సందర్భంగా బీసీ వివరించారు. కాగా ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు మూలే రామేశ్వరరెడ్డి, పులి ప్రకాశ్‌రెడ్డి, నంద్యాల రామేశ్వరరెడ్డి, ఇటిక్యాల బాలిరెడ్డి, అంబటి జయలక్ష్మీ రెడ్డి, నంద్యాల నారాయణరెడ్డి, కోరుమానుపల్లె ఓబయ్య, అబ్దులాపురం వెంకటరామిరెడ్డి, విజయ్‌, నరసింహారెడ్డి, భూపాల్‌, ఈశ్వరరెడ్డి, ఉలువల నరసింహుడు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: