ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా తాజాగా ఓటర్ల జాబితాను విడుదల చేయగా రాష్ట్రంలో మహిళా ఓటర్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారని తెలిసి షాకవ్వడం పురుష ఓటర్ల వంతవుతోంది. గతంతో పోల్చి చూస్తే సర్వీస్ ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిందని ముఖేశ్ కుమార్ మీనా వెల్లడించారు. అయితే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కేవలం 21 నియోజకవర్గాల్లో మాత్రం పురుష ఓటర్లదే పైచేయి కావడం గమనార్హం.
 
హిందూపురం, పెనుగొండ, మడకశిర, దర్శి, పత్తికొండ, ఆలూరు, కోడుమూరు, గాజువాక, చీపురుపల్లి, రాజాం, టెక్కలి, పాతపట్నం, ఆముదాలవలస, నరసన్నపేట, ఎచ్చెర్ల, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, పిఠాపురం, ఎర్రగొండపాలెం, మార్కాపురం నియోజకవర్గాలలో పురుష ఓటర్లు ఎక్కువగా ఉండగా మిగతా నియోజకవర్గాలలో మాత్రం మహిళా ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.
 
మరోవైపు ఓటర్ల నమోదులో కర్నూలు జిల్లా టాప్ లో నిలవగా అల్లూరి జిల్లా అత్యల్పంగా నిలిచింది. 20 లక్షల 56 వేల 203 మంది ఓటర్లతో కర్నూలు జిల్లా టాప్ లో నిలవడం గమనార్హం. 2019 ఎన్నికలతో పోల్చి చూస్తే ఈ ఎన్నికల్లో 5,94,631 మంది ఓటర్లు పెరగగా అత్యధిక జెండర్ రేషియో ఉన్న నియోజకవర్గాలలో రంపచోడవరం తొలి స్థానంలో నిలిచింది. ఇక్కడ ప్రతి 1000 మంది పురుష ఓటర్లకు 1,101 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
 
ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్న నియోజకవర్గాలలో భీమిలి తొలి స్థానంలో ఉంది. ఇక్కడ 3,64,304 మంది ఓటర్లు ఉన్నారు. తక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్న నియోజకవర్గం పెడన కాగా ఈ నియోజకవర్గంలో 1,67,622 మంది ఓటర్లు ఉండటం గమనార్హం. అత్యల్ప జెండర్ రేషియో ఉన్న నియోజకవర్గం గిద్దలూరు కాగా ఈ నియోజకవర్గంలో 1000 మంది పురుష ఓటర్లకు 964 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4.14 కోట్లుగా ఉంది.
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: