
ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను 2019 సెప్టెంబర్ 27న సినీ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి కలిశారు. ఆయన స్వస్థలం ఏపీలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. తమ ప్రాంతంలో సాగు నీటి సమస్య పరిష్కారం కోసం ఆయన సీఎంతో భేటీ అయ్యారు. ఆర్ నారాయణ మూర్తిని సీఎం జగన్ వద్దకు మంత్రి దాడిశెట్టి రాజా తీసుకెళ్లారు. ఆ సమయంలో తాండవ జలాశయంలో ఎక్కువ నీటిని సమకూర్చేందుకు విశాఖ జిల్లాలోని గొలుగొండ పేట వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలని ఆయన కోరారు. రిజర్వాయర్ లోకి పైపు లైను ద్వారా గోదావరి జలాలను అందించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. అప్పటికప్పుడు ఈ సాగునీటి ప్రాజెక్టు కోసం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇది జరిగిన తర్వాత 2021లో రూ.470 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.