ఏపీలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ ఆయన గెలుపును జనసైనికులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి పవన్ పరాజయం పాలయ్యారు. అయినప్పటికీ కొద్ది కాలంలోనే ప్రజల్లోకి తిరిగి వచ్చారు. ప్రజా సమస్యలపై గళం ఎత్తుతూ సామాన్యులకు అండగా తానున్నానంటూ అభయమిచ్చారు. ఈ క్రమంలో ఆయన వైసీపీ ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ, టీడీపీని ఒక్కటి చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడేందుకు ఎంతో శ్రమించారు. బీజేపీ పెద్దల చేతిలో చీవాట్లు కూడా తిన్నారు. చివరికి బీజేపీ కోసం తన వంతు సీట్లు కూడా తగ్గించుకున్నారు. ఇలా ఆయన కూటమి గెలుపు కోసం ఎంతో త్యాగం చేశారు. దీంతో ఆయన గెలుపు కోసం జనసైనికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం పిఠాపురంలో జనసైనికులకు తోడు సినిమా ఆర్టిస్టులు, జబర్దస్త్ ఆర్టిస్టులు సైతం వచ్చారు. అయితే వారికి ప్రచారం కోసం రూ.కోట్లలో ముట్టిందనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో పవన్‌కు భారీ మెజారిటీ వస్తోందని అంచనాలు ఉన్నాయి. పలు సర్వేల నివేదికల్లో సైతం ఇదే తేలింది. దీంతో పవన్‌ను ఓడించేందుకు వైసీపీ సిద్ధమైంది. అక్కడ గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన వంగా గీతను అభ్యర్థిగా నిలబెట్టింది. మరో వైపు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలో చేర్చుకుంది. వీరితో పాటు ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌ను, ద్వారంపూడి చంద్రశేఖర్‌ను కూడా ఇక్కడ రంగంలోకి దించింది. ఒక్కొక్కరికి ఒక్కో మండలాన్ని వైసీపీ అధిష్టానం అప్పగించింది. ఈ నియోజకవర్గంపై పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆర్థిక, ఇతర సహాయ సహకారాలను అందిస్తున్నారు. దీంతో జనసేన అప్రమత్తం అయింది. ఇప్పటికే టీడీపీ తరుపున పవన్ గెలుపు బాధ్యతను మాజీ ఎమ్మెల్యే వర్మ భుజానకు ఎత్తుకున్నారు. సినీ నటులు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ప్రచారం చేశారు. జబర్దస్త్ నటులు సుధీర్, హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను కూడా వచ్చారు. జబర్దస్త్ ఆర్టిస్టులు నెల పాటు తమ ఉపాధిని పక్కన పెట్టి ఇక్కడ ప్రచారం చేసినందుకు రూ.కోటి ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. దీనిపై గెటప్ శ్రీను ఫైర్ అయ్యారు. ఆ ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. పవన్ నిజాయతీపరుడని, ఆయన గెలిస్తే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. తాము డబ్బులు తీసుకున్నట్లు ఎవరైనా నిరూపించగలరా అని ప్రశ్నించారు. ఎవరికైనా అనుమానం ఉంటే తమ బ్యాంకు ఖాతాలు ఇస్తామని, చెక్ చేసుకోవాలని బదులిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: