ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఓ వైపు వైసీపీ, ఎలాగైనా మరోసారి అధికారంలోకి రావాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హోరాహోరీగా తలపడుతున్నాయి. కూటమి నేతలు ప్రచార సభలతో ఏపీలో ప్రజల దృష్టిని తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడివిడిగా, ఉమ్మడిగా రాష్ట్రం నలుమూలలా ప్రచారం చేస్తున్నారు. వీరికి తోడు బీజేపీ జాతీయ స్థాయి నేతలు సైతం రాష్ట్రానికి తరలి వస్తున్నారు. ఇటీవల ఏపీలో అమిత్ షా పలు ప్రచార సభల్లో పాల్గొన్నారు. తాజాగా ప్రధాని మోడీ సుడిగాలి పర్యటనలు చేపట్టారు. రాజమండ్రిలోనూ, అనకాపల్లిలోని రాజకీయ సభలకు హాజరై ప్రసంగించారు. రాజమండ్రి సభలో మోడీతో పాటు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పాల్గొన్నారు. ఇక అనకాపల్లి సభలో చంద్రబాబు, నాగబాబు మోడీతో పాటు పాల్గొన్నారు. అయితే ఈ సభల్లో జగన్ ప్రభుత్వ వైఖరిని ప్రధాని మోడీతో పాటు కూటమి నేతలు తూర్పారబట్టారు. ఆ సమయంలో ఆసక్తికర పరిణామం జరిగింది. చంద్రబాబు కంటే ఆయన కుమారుడు లోకేష్‌కు ప్రధాని మోడీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

జనసేన అధినేత పవన్, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో కలిసి తొలుత సోమవారం రాజమండ్రి సమీపంలోని సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఆ సమయంలో ముందుగా లోకేష్ మాట్లాడిన తర్వాత మోడీ మాట్లాడారు. ఇక ఆ సభలో మోడీని లోకేష్ ఆకాశానికి ఎత్తేశారు. ఓ వైపు దేశం మోడీ నాయత్వంలో ముందుకు వెళ్తుంటే రాష్ట్రంలో జగన్ నాయకత్వంలో అభివృద్ధి అధోగతి పాలైందన్నారు. జగన్‌పై విమర్శలతో లోకేష్ విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ సైతం ఏపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. అనంతరం అనకాపల్లి సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఆ సభలో చంద్రబాబు, నాగబాబు సైతం ఉన్నారు. ఇక దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్న ప్రధాని మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. అనకాపల్లి సభలో చంద్రబాబు కంటే ముందు ప్రసంగించారు. అనంతరం ప్రజలంతా చంద్రబాబు ప్రసంగం విని వెళ్లాలని కోరారు. తనకు బిజీ షెడ్యూల్ కారణంగా త్వరగా వెళ్తున్నట్లు చెప్పారు. ఈ ప్రకారం చూస్తే లోకేష్ ప్రసంగించడానికి అవకాశమిచ్చిన ప్రధాని మోడీ చంద్రబాబుకు మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదు. దీంతో లోకేష్‌కు ప్రధాని మోడీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: