ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో వివిధ పార్టీల నుంచి సుమారుగా 50మంది మహిళలు పోటీ పడుతున్న విషయం మీకు తెలుసా? పాలక వైసీపీ నుండే 21మంది మహిళా అభ్యర్థులు పోటీలో ఉండగా, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నుంచి 23 మంది మహిళలు పోటీ చేస్తుండడం కొసమెరుపు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి 11 మంది మహిళా అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. వీరిలో కొందరు గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచినవారు కాగా మరికొందరు మాత్రం తొలిసారి ఎన్నికల బరిలో దిగుతుండడం శుభపరిణామమనే చెప్పుకోవాలి. ఎందుకంటే స్త్రీలకు చట్ట సభలలో కూడా స్థానం దక్కాలి అనే మాట నేడు నిజమైంది.

ఈ క్రమంలో ఆయా మహిళల ప్రత్యేకత ఏమిటో అని మనకి ప్రశ్న తలెత్తక మానదు. విషయంలోకి వెళితే, శింగనమలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న 34 ఏళ్ల బండారు శ్రావణిశ్రీకి పార్టీ శ్రేణులలో, సోషల్ మీడియాలో ఎటువంటి ఫాలోయింగ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. 2019 ఎన్నికలలో మొదటి సారి పోటీ చేసిన ఆమె ఆ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి చేతిలో ఓటమి పాలుకాగా ఈ ఎన్నికలలో కూడా తెలుగుదేశం పార్టీ మరోసారి బండారు శ్రావణికే టికెట్ ఇవ్వడం చాలా మంచి అంశం. అదేవిధంగా ప్రస్తుత 2024 ఎన్నికలలో టీడీపీ నాయకత్వం మరోసారి పరిటాల సునీతనే పోటీలో నిలిపింది. ఆమె గురించి అందరికీ తెలిసిందే. ఇక ప్రత్యర్థి నేతలపై తనదైన మాటల శైలితో విరుచుకుపడడంలో ముందుండే మంత్రి ఆర్‌కే రోజా మరోసారి తన సిటింగ్ స్థానం నగరి నుంచి మరోసారి బరిలో ఉన్నారు. రోజా గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావన అవసరం లేదు.

మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై వైసీపీ నుంచి మురుగుడు లావణ్య పోటీ చేయబోతున్నారు. మాజీ ఎమ్మెల్యే మురుగుడు హనుమంతరావు కుటుంబీకురాలైన లావణ్య ఎంఏ ఇంగ్లిష్ చదువుకున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాంటి హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో సిటింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ నుంచి టీఎన్ దీపిక పోటీ చేస్తున్న విషయం అందరికీ విదితమే. ఎంసీఏ చదువుకున్న 40 ఏళ్ల దీపిక అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. అదే విధంగా పిఠాపురంలో పోటీ చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో వైసీపీ నుంచి తలపడుతున్న నేత వంగా గీత. ఈమె గత ఎన్నికలలో కాకినాడ ఎంపీగా గెలిచారు. ఇక జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నవారిలో ఏకైక మహిళా అభ్యర్థి లోకం మాధవి. ఆమె నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం బరిలో ఉన్నారు. అమెరికాలోని కెంట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చదువుకున్న ఆమె భర్తతో కలిసి మిరకిల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ సంస్థను నిర్వహిస్తుండడం గమనార్హం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 50 మంది మహిళలు కూడా వివిధ రంగాల్లో మంచి పేరున్నవారే కావడం హర్షణీయం.

మరింత సమాచారం తెలుసుకోండి: