ఈసారి ఎన్నికల్లో వేవ్ అన్నది కనిపించలేదని అంతా విశ్లేషించుకొన్నారు. ఓటరు నిరాసక్తగా ఉన్నారని ఎవరి అంచనాలు వారు వేసుకున్నారు. ఇక ఏపీలో భావోద్వేగమైన అంశాలు ఈ సారి ఎన్నికల ప్రచారంలో లేవని కూడా భావించారు. ఓటరుని ఇంటి నుంచి పోలింగ్ బూత్ దాకా కదిలించే శక్తి పార్టీలకు కానీ. వారి మ్యానిఫెస్టోలకు కానీ లేదని తలపోశారు.


తీరా పోలింగ్ రోజు చూస్తే మాత్రం సూర్యోదయం కాకముందే పోలింగ్ బూత్ లకు బారులు తీరారు. ఓటు వేసి తీరాలని పట్టుబట్టి మరీ అర్ధరాత్రి వరకు పోలింగ్ క్రతువులో పాల్గొన్నారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా కసిగా నిలిచారు. ఈ అంశమే రికార్డు స్థాయి ఓటింగ్ కు కారణం అయింది. ఇలా చూసినప్పుడు సైలెంట్ వేవ్ అన్నది ఏపీలో ఉందని అర్థం అవుతుంది. కానీ దానిని పసిగట్టలేని స్థితిలో పార్టీలు ఉన్నాయనేది మాత్రం వాస్తవం.


ఇక ఎవరు అధికారం చేపట్టినా వారికి ఈ ఎన్నికలు మేల్కొలుపే అని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికలు ఏపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సాగింది. అందుకే వృద్ధులు, మహిళలు, యువత, రైతులు ఇలా అన్ని వర్గాల వారు పోలింగ్ లో భాగస్వాములయ్యారు. దేశ విదేశాల నుంచి.. పక్క రాష్ట్రాల నుంచి వచ్చీ మరీ ఓటేశారు.


ఇక్కడ వైసీపీ గెలిస్తే సంక్షేమ పథకాలను ఏపీ ప్రజలు ఆమోదించినట్టే. దాంతో పాటు అభివృద్ధి నినాదంపై జగన్ వాదనతో వారు ఏకీభవిస్తున్నట్లు మనం భావించవచ్చు. ఇక మూడు రాజధానుల అంశం  కూడా ప్రజామోదం పొందినట్లే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  ఒకవేళ టీడీపీ విజయం సాధిస్తే సంక్షేమంతో పాటు అభివృద్ధి అజెండా తో రూపొందించిన మ్యానిఫెస్టోకి ఆకర్షితులైనట్లు లెక్క. దీంతో పాటు అమరావతి రాజధానికి అంగీకారం లభించినట్లే. ఇరు పార్టీల అధినేతలు కూడా ఈ ఎన్నికల ఫలితాలను రెఫరెండగా తీసుకొని పాలన సాగించాల్సి ఉంటుంది. మరి ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపారో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: