- రాజమండ్రి సిటీపై స్పెషల్ ఫోకస్ చేసి ఎమ్మెల్యేగా పోటీ
- భరత్ గెలిచి.. జగన్ ప్రభుత్వం ఏర్పడితే గౌడ కోటాలో కేబినెట్ బెర్త్..?
( గోదావరి - ఇండియా హెరాల్డ్ )
2019 ఎన్నికలలో వైసీపీ నుంచి చాలామంది యువ నేతలు రాజకీయాలకు వచ్చి తొలి ప్రయత్నం లోనే సక్సెస్ అయ్యారు. వీరిలో కొందరు మంత్రులు అయితే మరి కొందరు ఎంపీలు అయ్యారు. మరికొందరు చిన్న వయసులోనే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి కూడా మంత్రులు అయిపోయారు. సీదిరి అప్పలరాజు, విడదల రజిని, చెల్లుబోయిన వేణు, ఉషాశ్రీ చరణ్ కూడా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన జగన్ ప్రభుత్వంలో.. మంత్రులు అయిపోయారు. ఇక చిన్న వయసులోనే రాజకీయాలకు వచ్చి ఎంపీలు అయిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అలాంటివారిలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ఒకరు. మార్గాని భరత్ గతంలో తెలుగుదేశం పార్టీలో కొనసాగే వారు.
సామాజికంగానూ, ఆర్థికంగా బలమైన కుటుంబానికి చెందిన యువ నేత. అయినా తెలుగుదేశం పార్టీలో ఈ కుటుంబానికి రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యత లభించలేదు. 2019 ఎన్నికల్లో జగన్ రాజమండ్రి సీటును బీసీలకు ఇచ్చి ప్రయోగం చేశారు. భరత్ ఏకంగా సీనియర్ నేత మాగంటి మురళీమోహన్ కోడలు మాగంటి రూపాదేవి పై లక్ష ఓట్ల పైచిలుకు భారీ మెజార్టీతో విజయం సాధించి పార్లమెంటులోకి అడుగుపెట్టారు. ఐదేళ్లలో భరత్ ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యారు. మీడియాలో వైసీపీ తరఫున బలమైన వాయిస్ వినిపించడం ద్వారా తెలుగు ప్రజల్లో తిరుగులేని గుర్తింపు సొంతం చేసుకున్నారు.
అన్ని అంశాలపై భరత్ కు ఉన్న సమగ్రమైన అవగాహన,, పట్టు భరత్‌ను రాష్ట్రస్థాయిలో మీడియా పరంగా చాలా హైలైట్ చేశాయి. భరత్ ఎంపీగా గెలిచినా గత ఎన్నికల్లో రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ రెండు నియోజకవర్గాలలోను తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది. అప్పటి నుంచే జగన్ సూచనల మేరకు భరత్ ఈ రెండు నియోజకవర్గాలపై గట్టిగా దృష్టి పెట్టారు. ఈ ఎన్నికలలో తాను అసెంబ్లీకి పోటీ చేయాలన్న ప్లానింగ్‌తో ఐదేళ్లలో రాజమండ్రి నియోజకవర్గాన్ని ఒక రేంజ్ లో అభివృద్ధి చేశారు. తన ఎంపీ ల్యాండ్స్ నిధులలో కూడా ఎక్కువ భాగం రాజమండ్రి సిటీలోనే ఖర్చు పెట్టారు.
నగర ఆధునికీకరణ.. అభివృద్ధి రహదారుల వెడల్పు.. నగరంలో ప్రతి ఒక్కరికి కావలసిన మౌలిక సౌకర్యాలపై బాగా దృష్టి పెట్టారు. ఇటు మీడియాలోను యాక్టివ్‌గా ఉంటూ వచ్చారు. గత ఎన్నికలలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి భవాని ఏకంగా 32 వేల ఓట్ల తేడాతో విజయం సాధిస్తే.. ఈసారి టీడీపీ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే భవాని భర్త ఆదిరెడ్డి వాసు ... వైసీపీ అభ్యర్థి ఎంపీ భరత్‌మధ్య చాలా గట్టి పోటీ నడిచింది. ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీతో గెలుస్తారని చర్చలు వినిపిస్తున్నాయి. ఈసారి భరత్ గెలిచి... జగన్ ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడితే కచ్చితంగా మంత్రి పదవి వస్తుందన్న అంచనాలు కూడా ఉన్నాయి.