ఇక ఈసారి ఎన్నికల ప్రచారాలు ఏమాదిరి జరిగాయో మీకు తెలియంది కాదు. ఆంధ్రా జనాలకోసం ఎంతో చేశామని జగన్ తన ప్రచారంలో భాగంగా చెప్పుకు రావడం అందరికీ తెలిసినదే. మొదట్లో జగన్ సంక్షేమ పధకాల గురించి జనాలకు గుర్తు చేస్తూ తరువాత అభివృద్ధి చేసానని జనాలకు చెప్పేవారు. ఆయన పాల్గొన్న ప్రతీ ఎన్నికల సభలో దాదాపు గంట పాటు కేవలం తన పాలనలో ఏమి చేశాను? అన్న దాని మీదనే ఎక్కువగా మాట్లాడడం జరిగింది. వారు చెబుతున్న లెక్కలు ప్రకారం లబ్ధిదారుల ఖాతాలో నేరుగా నగదుని బదిలీ చేసే కార్యక్రమం కింద 4 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించింది వైసీపీ. ఇక నాడు నేడు, ఇంగ్లీష్ మీడియం చదువులు, పాఠశాల విద్యార్థులకు ట్యాబ్ లు ఇవ్వడం ఇలా స్కూల్ డెవలప్మెంట్ కి ఎంత ఖర్చు చేసిందో ఊహించుకోవచ్చు.
అయితే ఇవన్నీ చెప్పుకోవడానికి సరిగ్గానే ఉంటాయి. కానీ అసలు విషయం ఏంటంటే ప్రజలకు నేరుగా కళ్ళకు కనిపించేవి రోడ్డు, ఇరిగేషన్ ప్రాజెక్టులే అని విశ్లేషకులు అంటున్నారు. అవును, జగన్ ప్రభుత్వం రోడ్ల విషయంలో ఒక పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటే కనుక ఆయన పాలనలో జరిగిన అభివృద్ధి విషయం కూడా జనాలకు బాగా ఎక్కేది. తద్వారా జనాలు ఓట్లను కుమ్మరించేవారు అని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా రైతులకు వివిధ రకాలైన పని ముట్ల కింద మరో అయిదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా అవి కూడా కంటికి కనిపించేవి అని అంటున్నారు. మొత్తంగా గ్రామీణ ప్రాంతాలలో అయితే వైసీపీ తన బలాన్ని ఇంతకు ఇంతా పెంచుకునే అవకాశం ఉన్నా కూడా ఎందుకో మరో ఇరవై వేల కోట్ల రూపాయలు పెట్టేందుకు ఆలోచించిందా? అన్నదే ఇపుడు చర్చగా మారింది.