మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు ప్రస్తుతం ఏపీలో మారుమ్రోగుతోంది. పోలీసుల నుంచి పిన్నెల్లి ఎలా తప్పించుకున్నారనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పిన్నెల్లికి సహాయసహకారాలు అందించారనే ఆరోపణలు ఉన్నా ఈ ఆరోపణల్లో వాస్తవాలు తెలియాల్సి ఉంది. పోలింగ్ బూత్ లో ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో బయటకు వచ్చిన తర్వాత పిన్నెల్లిని అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు.
 
పిన్నెల్లికి ఏడేళ్లు జైలు శిక్ష పడే అవకాశం అయితే ఉందని సీఈవో ముఖేశ్‌కుమార్‌ మీనా ఇప్పటికే వెల్లడించారు. అదే సమయంలో కోర్టు రెండు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష విధిస్తే ఆయనపై అనర్హత వేటు కూడా పడే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. మొత్తం 10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసు నమోదు కాగా మాచర్లలో మొత్తం ఏడు ఈవీఎంలు ధ్వంసం అయ్యాయని సమాచారం అందుతోంది.
 
అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేశారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో లోకేశ్ దగ్గరకు ఎలా వెళ్లిందని టీడీపీ సోషల్ మీడియా గ్రూప్స్ లో ఏ విధంగా వైరల్ అవుతోందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆ వీడియో ఎలా బయటకు వచ్చింది? టీడీపీ ముఖ్య నేతలకు ఆ వీడియోను ఎవరు చేరవేశారు? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పందిస్తే తప్ప ఎన్నో ప్రశ్నలకు జవాబులు దొరకవు. అదే సమయంలో వీడియో వెనుక వాస్తవాలను తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా అధికారులపై ఉంది. రిగ్గింగ్ చేయడం వల్లే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేశారని వార్తలు వినిపిస్తుండగా నిజంగా రిగ్గింగ్ జరిగితే ఆ వీడియో ఎందుకు బయటకు రాలేదనే ప్రశ్నలు సైతం వినిపిస్తుండటం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులకు సంబంధించిన ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: