- పార్టీ ఫండింగ్ చేసే సర్వేలు ఏకపక్షమే..?
( ఉత్తరాంధ్ర - విశాఖపట్నం )
ఎన్నికలు అనగానే.. అనేక మంది విశ్లేషణలు చేస్తారు. అనేక మంది సర్వేల పేరుతో తెరమీదికి వస్తారు. అయితే.. ఏ సర్వే కరెక్ట్ ? అంటే.. మాత్రం కొంత మేరకు తడబాటు తప్పదు.అనేక మంది సర్వేరాయుళ్లు ఎన్నికలకు ముందు అనేక విశ్లేషణలు చేస్తారు. అయితే..ఎవరిది విశ్వసనీయ సర్వే.. అనే విషయం చూస్తే.. చిత్రమైన అంశాలు వెలుగు చూస్తాయి. నిజానికి రెండు రకాల సర్వేలు ఉంటాయి. ఒకటి తాజా పరిణామాలను అంచనా వేసి.. ఆఫీస్‌లో కూర్చుని లెక్కలు గట్టే సర్వేలు కొన్ని ఉంటాయి.
ఇవి ఒక్కొక్కసారి నిజమవుతాయి. ఉదాహరణకు తెలంగాణ ఎన్నికల సమయంలో పరిణామాలను అంచ నా వేసి చెప్పిన ఓ సర్వే నిజమైంది. ఇక, రెండో రకం సర్వేలో ప్రజల్లోకి నేరుగా వెళ్లి కొన్ని శాంపిళ్లు తీసు కుని ఫలితాలను అంచనావేయడం. ఇవి విశ్వసనీయమైనవే అయినా.. ఇక్కడ ఏ ప్రాంతం.. ఏ నియోజక వర్గం.. ఎన్ని శాంపిళ్లు తీసుకున్నారు..అనే అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఈ విషయంలో చాలా కీన్ అబ్జర్వేషన్ ఉండాలి. అంతేకాదు.. క్షేత్రస్థాయిలో చేసే సర్వేలకు ఖర్చుకూడా బాగానే అవుతుంది.
ఉదాహరణకు ఒక ప్రాంతాని కి వెళ్లి..అక్కడివారిని కలుసుకునేందుకు ఒక్కొక్కసారి క్షేత్రస్థాయిలో కొందరిని మచ్చిక చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. దీంతో ఆయా వర్గాలకు కొంత ఖర్చు పెట్టాలి. అప్పుడే పర్‌ఫెక్ట్ అంచనా వస్తుంది. ఇక, మూడో రకంగా సర్వే ఇప్పుడు ఎవరూ చేయడం లేదు. ఇది గ్రామీణ ప్రాంతంపై చేసే సర్వే. ఇది ఖచ్చితత్వంతో కూడిన సర్వేగానే చెప్పాలి. ఇక్కడే అసలు కిటుకు బయట పడుతుంది. కానీ.. ఇప్పుడు ఎవరూ ఇంత రిస్క్ తీసుకోవడం లేదు.
మరోవైపు.. విశ్వసనీయత విషయానికి వస్తే.. ఏ సర్వే సంస్థయినా.. క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వేలు ఇస్తే.. కేవలం ఊరికేనే ఇవ్వదు. దానికి అయ్యే ఖర్చుతో పాటు కొంత చార్జీలుకూడా పడతాయి. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో వచ్చే సర్వేలు.. చాలా వరకు ఏకపక్షంగా ఉంటాయి. అంటే ఏదో ఒక పార్టీ ఫండింగ్ చేస్తుంది. దీంతో ఆయా పార్టీలకు ఒకింత అనుకూలంగా ఉంటాయి. దీంతో కొన్ని కొన్ని సర్వేలపై విశ్వసనీయత తగ్గుతున్న మాట వాస్తవం. ఇక, జాతీయ మీడియాలు చేసే సర్వేలు.. కూడా కొంత వరకు ఇలానే ఉన్నా.. ఒకింత నమ్మదగినవేనని పరిశీలకుల అభిప్రాయంగా ఉంది.