గతంలో ఎప్పుడూ లేనంతగా ఏపీ ఎన్నికల ఫలితాల కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక్క ఏపీ ప్రజలే కాకుండా దేశం మొత్తం  ప్రస్తుతం రాష్ట్రంలో ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. దీనికి చాలా కారణాలు కూడా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక స్థాయిలో ఓటర్లు పోలింగ్ బూత్‌ల వద్ద ఆ సమయంలో పోటెత్తారు. విదేశాల్లో, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాల్లో ఉన్న వారంతా స్వస్థలాలకు వచ్చి కసిగా ఓటు వేశారు. జాతీయ స్థాయిలో సైతం ఏపీ ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా చూస్తున్నారు. 

ఓ వైపు దేశంలో ఎవరు అధికారంలోకి వస్తారో అనే చర్చ సాగుతూనే ఉంది. అదే సమయంలో ఏపీ ఎన్నికల కోసం కూడా అంతా నిరీక్షిస్తున్నారు. ఓ వైపు సంక్షేమ పథకాల ద్వారా ప్రజల మద్దతు కూడగట్టుకున్న వైసీపీ, ఉద్యోగాలు, అభివృద్ధి, ఏపీ భవిష్యత్తు లక్ష్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రజల్లోకి దూసుకెళ్లారు. ప్రతి పార్టీ ప్రత్యర్థికి తగ్గట్టు ఎత్తుకు పై ఎత్తులు వేశారు. ఏపీలో ఏ పార్టీకి అధికారం వస్తుందోనని తెలంగాణలోనూ ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 20 కోట్ల తెలుగు వారంతా టీవీలకు అతుక్కుపోనున్నారు. దీనికి మరో ఆసక్తికర కారణం కూడా ఉంది.

ఏపీలో ఎన్నికల ఫలితాల సమయంలో ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్‌కు ఇంటెలిజెన్స్ నివేదికలు వచ్చాయి. దీంతో ఉద్రిక్తతలు తలెత్తకుండా ఎన్నికల ఫలితాల వేళ రాష్ట్ర వ్యాప్తంగా కఠినమైన నిబంధనలు అమలు చేయనున్నారు. ఇప్పటికే జూన్ 15 వరకు సీఆర్‌పీఎఫ్, ఇతర కేంద్ర బలగాలు ఏపీలో మోహరించనున్నాయి.


సమస్యాత్మక ప్రాంతాల్లో మరింత ఎక్కువగా రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలు మోహరించనున్నాయి. అంతేకాకుండా బలగాలన్నీ ఎన్నికల ఫలితాలకు ఒక రోజు ముందు అంటే జూన్ 3న కవాతు నిర్వహించనున్నాయి. పైగా ఇతర ప్రాంతాల వారికి లాడ్జిలు, హోటళ్లలో గదులు ఇవ్వొద్దని ఎన్నికల అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అల్లర్లను, ఉద్రిక్తతలను చల్లార్చేందుకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. పెట్రోల్ బంకుల్లో విడిగా లూజ్ పెట్రోల్ విక్రయించొద్దని స్పష్టంగా ఆదేశాలున్నాయి. ఫలితాల రోజుల టపాసులు కాల్చి సంబరాలు చేసుకోవడానికి కూడా వీల్లేదు. దీంతో అత్యంత కఠినమైన ఆంక్షలు ఉండడంతో ప్రజలంతా ఏపీలో జూన్ 4న ఇంట్లోనే ఉండనున్నారు. టీవీల ద్వారా తమ అభిమాన పార్టీ లేదా అభ్యర్థి గెలుస్తారో లేదో అని తెలుసుకోనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: