ఏపీలో ఎంతో హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మరో 5 రోజుల్లో అంటే జూన్ 4న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. వివిధ పార్టీల, అభ్యర్థుల భవితవ్యం ఆ రోజు తేలనుంది. ఇప్పటి వరకు తమ అభిమాన పార్టీల తరుపున చాలా మంది ప్రజలు పని చేశారు. కొందరైతే తమ సొంత నిధులు సైతం తమ అభిమాన పార్టీకి ఖర్చు చేశారు. పంతాలకు పోయి చాలా మంది ఆస్తులు సైతం అమ్ముకున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా వివిధ పార్టీలు ప్రచార కార్యక్రమాలు చేపట్టాయి. 

ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో స్థిర పడ్డ వారు సైతం రాష్ట్రానికి వచ్చి ఓటు వేశారు. ముఖ్యంగా ఏపీలో పోలింగ్ రోజున హైదరాబాద్ నిర్మానుష్యంగా కనిపించిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పాత మేనిఫెస్టోనే ముందు పెట్టి వైఎస్ జగన్ ప్రజల్లోకి వెళ్లారు. దానిని మించి ప్రజాకర్షక పథకాలతో మేనిఫెస్టోను టీడీపీ, జనసేన పార్టీలు విడుదల చేశాయి. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇంట్లో ఎంత పిల్లలున్నా వారందరికీ అమ్మఒడి తరహాలో విద్యకు ఆర్థిక సాయం, 50 ఏళ్లకే పింఛను వంటివి ప్రజల్లోకి వెళ్లాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మే 13న ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి. మరికొన్ని రోజుల్లోనే అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఈ సమయంలో ఆవేశాలకు పోయి కొందరు తమ పార్టీల తరుపున ఇతర పార్టీల శ్రేణులతో ఘర్షణకు దిగుతున్నారు.

ఇలా ప్రత్యర్థి పార్టీలతో చాలా మంది పంతాలకు పోయి వివాదాలు పెట్టుకుంటున్నారు. ఫలితంగా గొడవలు జరిగి కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో తమ జిల్లాలలోని జైళ్లు సరిపోక సెంట్రల్ జైళ్లకు, ఇతర ప్రాంతాల జైళ్లకు నిందితులను పోలీసులు తరలిస్తున్నారు. ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా కామన్ మేన్ అనే వాడు తన పని తాను చూసుకోవాల్సిందే. పొట్ట కూటి కోసం ఏదో ఒక పని చేసుకోవాల్సిందే. అది దృష్టిలో ఉంచుకోకుండా కొందరు ఘర్షణలకు దిగుతున్నారు. అల్లర్లకు పాల్పడుతున్నారు.


 ఇలాంటి వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఒక్కసారి యువకులపై కేసు నమోదు అయిందంటే వారు భవిష్యత్తు నాశనం అవుతుంది. కేసులు ఎవరి మీద నమోదయ్యాయో వారు జీవితాంతం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. మరోవైపు ఇంకొందరు తమ ఆస్తులు సైతం పందేలు కాస్తున్నారు. తమ అభిమాన పార్టీ గెలుస్తుందని సర్వస్వం యావదాస్తి బెట్టింగ్స్ పెడుతున్నారు. ఇలాంటివి యువత మానుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన పార్టీ తాము ఇచ్చిన హామీలను అమలు చేస్తుందా లేదా అనేది గమనించాలని, లేకుంటే వారు అమలు చేసేలా పోరాడాలని పేర్కొంటున్నారు. ఇలా కాకుండా తమ శక్తియుక్తులను, సర్వస్వాన్ని గొడవలకో, ఉద్రిక్తతలు పెంచడానికో ఉపయోగించొద్దని అధికారులు సైతం కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: