- ఎవరు అప్పులు చేసినా ఎదురు దాడి ఖాయం
- వైసీపీ గెలిస్తే రాజధాని రగడ మళ్లీ తప్పదు
- టీడీపీ సూపర్ సిక్స్ చేతులెత్తేస్తే వైసీపీ నుంచి చెడుగుడే..!
( విజయవాడ - ఇండియా హెరాల్డ్ )
తాజాగా వచ్చిన ఏపీ ఎగ్జిట్ ఫలితాలను గమనిస్తే.. వచ్చే ఐదేళ్లు కూడా..ఏపీ అసెంబ్లీ దద్దరిల్లడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఇటు కూటమి (టీడీపీ+బీజేపీ+జనసేన) అధికారంలోకి వచ్చినా.. వైసీపీకి 55-65 సీట్లు తగ్గేలా లేవు. ఇక, వైసీపీ అధికారంలోకి వచ్చినా.. కూటమికి 60-65 దాకాగా సీట్లు వచ్చే అవకాశం ఉందని.. ఎగ్జిట్ ఫలితాలు చెబుతున్నా యి. దీంతో అధికార పక్షం కన్నా.. ప్రతిపక్షం మరింత బలంగా ఉండే అవకాశం ఉంది. దీంతో అసెంబ్లీలో ఇరు పక్షాల మధ్య యుద్ధం ఓ రేంజ్‌లో ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
అంతేకాదు.. ప్రస్తుతం విభజన తర్వాత.. పదేళ్ల కాలం పూర్తయిన నేపథ్యంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. పోలవరం నుంచి రాజధాని వరకు, విశాఖ ఉక్కు కర్మాగారం నుంచి ఇతర పనుల వరకు .. ముఖ్యంగా తెలంగాణ నుంచి రావాల్సిన ఆస్తులు, అప్పుల వరకు కూడా.. ఏపీ ఎన్నో సాధించాల్సి ఉంది. అయితే.. అధికార పక్షం ఏ నిర్ణయం తీసుకున్నా.. దీనికి బలమైన ప్రతిపక్షంగా ఉండే కూటమి లేదా.. వైసీపీ ఏమేరకు సహకరిస్తాయనేది ప్రశ్నార్థకమే. అంతేకాదు.. నిజానికి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే టీడీపీ అసెంబ్లీలో తన సత్తా చాటింది.
అదేవిధంగా 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు వైసీపీ ప్రతిపక్షంగా తన దూకుడు చూపింది. ఇప్పుడు మరింత కాకతో ముందుకు సాగడం ఖాయం. పైగా.. కూటమి అధికారంలోకి వస్తే.. వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ హామీలను ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఏ చిన్న తేడా వచ్చినా.. వైసీపీ నిలదీయడం ఖాయంగా కనిపిస్తోంది. మరో వైపు అప్పులు పెరిగిపోతున్నాయన్నవాదన కూడా ఉంది.అప్పుడు కూటమి అప్పులు చేస్తే.. వైసీపీ ఎదురు దాడి చేయడం ఖాయం. మొత్తంగా కూటమి అధికారంలో ఉన్నా.. నిద్రలేని రాత్రులు ఖాయం.
ఇక, కూటమి విపక్షంలో ఉండి.. వైసీపీ అధికారంలో ఉంటే.. అప్పుడు కూడా.. ఇదే సమస్యలు తెరమీదికి వస్తాయి. రాజధానిని మార్చాలన్న నిర్ణయాన్ని కూటమి అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేయడం ఖాయం. అదేవిధంగా అప్పులు చేయకుండా అడ్డుకునే ప్రయత్నాలు కూడా కళ్లకుకనిపిస్తున్నాయి. ఇక, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుపైనా ఒత్తిడి ఖాయం. ఎలా చూసుకున్నా.. కూటమి కూడా.. ఏమాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి అయితే ఉండదు. సో.. మొత్తంగా చూస్తే.. ఎవరు గెలిచినా.. ఎవరు ఓడినా.. అసెంబ్లీ మాత్రం దద్దరిల్లడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.