ఆంధ్ర రాజకీయాల తీరు గత దశాబ్దకాలంలో చాలావరకు మారిపోయింది. సహజంగా ఎక్కడైనా రాజకీయంగా ప్రత్యర్ధులు పోటీ పడతారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి పూర్తి భిన్నంగా తయారైంది. ఇక్కడ ప్రత్యర్ధులు శత్రువులు మాదిరి పోరాడుతున్న పరిస్థితి దాపురించింది. దానికి కారణం నాయకులా, ప్రజలా అన్న విషయం ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. ప్రస్తుత తీరు ఇక్కడ ఎలా సాగుతుందంటే అధికారంలోకి ఎవరైనా ఎక్కాలే కానీ అపొజిషన్ ని లేకుండా చేయాలని కలలు కంటున్నారు. ఈ రకమైన విశ్లేషణలు ఇపుడు చాలా మంది బయటకొచ్చి వినిపిస్తున్నారు. నిజానికి ఇది చాలా దురదృష్టకరం.

ప్రజలు అనేవారు ఈ ప్రజాస్వామ్యంలో ఎవరినీ తక్కువ చేయరు. ఒకరికి అధికారం ఇచ్చి రెండవ వారికి ప్రతిపక్షం హోదానిచ్చి గురుతర బాధ్యతలు అప్పగిస్తారు. దాంతో వారు కూడా ప్రభుత్వంతో కలసి ప్రజల కోసం పని చేస్తారు. ఎక్కడన్నా లోటుపాట్లుంటే సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. కానీ కొన్ని దశాబ్దకాలం నుండి మాత్రం ఇక్కడ నియంత పాలన కొనసాగుతోంది. అందుకే ఇక్కడ విపరీత పోకడలు ఎక్కువయినాయి. ఇప్పుడు కాదు కానీ ఒకప్పుడు తమిళనాడులో ఇదే తరహా రాజకీయం రాజ్యమేలేది.

అలా సాగిన పోరులో చివరికి మహిళ అని చూడకుండా జయలలితని నిండు శాసనసభలో వివస్త్రని చేసే ప్రయత్నం చేసారు. అలాగే వయోవృద్ధుడని చూడకుండా కరుణానిధిని అర్ధరాత్రి అరెస్ట్ చేసేలా చేసింది. ఎంత గొడవ ఉన్నా కేంద్రానికి ఎక్కడా ఆస్కారం ఇచ్చేవారు కాదు. ఇపుడు చూస్తే తమిళనాడులో పరిస్థితి మాదిరిగానే ఏపీలో మనకి కనబడుతోంది అని వాపోతున్నారు కొంతమంది విశ్లేషకులు. అవును, ఏపీలో సిద్ధాంత రాహిత్యం ప్రాంతీయ పార్టీలలో మెండుగా కనబడుతోందని చెబుతున్నారు. అధినేతలు సైతం సహనం కోల్పోవడంతో క్యాడర్ దిగువ స్థాయి లీడర్లు ఎవరికి నచ్చినట్టు వారు ప్రవర్తిస్తున్నారు అని అభిప్రాయపడుతున్నారు.

ఎవరు ఎంత గించుకున్నా జూన్ 4న తరువాత గెలిచేది ఒక పార్టీనే. ఆ పార్టీ ఏదైనా 2వ పార్టీని నిర్వీర్యం చేయకుండా వారిని కూడా ప్రజా స్వామ్యంలో ప్రజా తీర్పునకు అనుగుణంగా గౌరవిస్తే అదే చాలునని అంటున్నారు. అలాగే అంతా కలసి ఏపీ అభివృద్ధి కోసం పాటుపడితే అది ఇంకా మేలు చేస్తుందని ఆశిస్తున్నారు. మరి అలాంటి మంచి వాతావరణం ఈ ఎన్నికలతో అయినా ఏపీలో వస్తుందని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: