అనపర్తి నియోజకవర్గం ఈసారి ఎన్నికలలో చాలా ట్విస్టులు, సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిందని చెప్పాలి. అధికార వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి మరోసారి బరిలో నిలిచారు. ఇక విపక్ష కూట‌మి నుంచి ముందుగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరు ఖ‌రారు అయింది. అయితే చివరలో అనూహ్యంగా రామకృష్ణారెడ్డి బీజేపి సింబల్ మీద అనపర్తిలో పోటీ చేశారు. 2014, 2019, 2024 మూడు ఎన్నికలలోను వీరిద్దరే ప్రత్యర్థులుగా పోటీపడ్డారు. 2014 లో నల్లమిల్లి విజయం సాధిస్తే.. 2019లో సూర్యనారాయణ రెడ్డి గెలిచారు. అయితే ఈసారి నల్లమిల్లి బీజేపి నుంచి పోటీ చేయటం మాత్రమే ట్విస్ట్ అని చెప్పాలి.


నియోజకవర్గంలో తూర్పుగోదావ‌రి జిల్లా ప‌రిధిలో అనపర్తి మున్సిపాలిటీ తో పాటు.. అనపర్తి, రంగంపేట, బిక్క‌వోలుతో పాటు కాకినాడ జిల్లాలోని పెద‌పూడి మండలాలు విస్తరించి ఉన్నాయి. నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానిది.. రాజకీయ అధిపత్యం. ఇక్కడ నుంచి గత కొన్ని దశాబ్దాలుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. కాపులు కూడా చాలా బలంగా ప్రభావం చూపుతారు. ఈసారి జనసేనతో పొత్తు నేపథ్యంలో అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నుంచి పోటీ చేయడంతో.. ఆ ప్రభావం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో గట్టిగా కనిపించింది.


అయితే ఇక్కడ బీజేపి కమలం సింబల్ ఉండడంతో.. కూటమి ఓట్లు ఎంతవరకు బీజేపికి ట్రాన్స్ఫర్ అయ్యాయి అన్న సందేహం అయితే ముందు నుంచి ఉంది. ఎన్నికల ప్రచారం ప్రారంభమయ్యాక పోలింగ్ సరళిని బట్టి చూస్తే అనపర్తిలో గట్టి పోటీ ఉన్నా కూడా వైసీపీకి స్వల్ప ఆధిక్యత ఉందని వైసీపీ గెలుస్తుందన్న అంచనాలు, నివేదికలు ఎక్కువగా వినిపించాయి. ఈరోజు తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగిన కౌంటింగ్ లో న‌ల్ల‌మిల్లి రామ‌కృష్ణా రెడ్డి ఏకంగా 20,500 ఓట్ల పై చిలుకు మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించారు.


ఇది ఏపీలో బీజేపీ సాధించిన తొలి విజ‌యంగా రికార్డుల‌కు ఎక్కింది. పార్టీ మారి బీజేపీలోకి వెళ్లినా కూడా రామ‌కృష్ణా రెడ్డి ఈ రేంజ్‌లో సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డం నిజంగా రికార్డే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: