ఏలూరు జిల్లాలోని ఏకైక ఎస్సీ రిజర్వ్ సెగ్మెంట్ చింతలపూడి. ఆ మాటకు వస్తే ఉమ్మ‌డి ఉభ‌య గోదావరి జిల్లాలోనే ఓట్ల పరంగా అతిపెద్ద నియోజకవర్గం చింతలపూడి. తెలంగాణ బోర్డర్ కు సరిహద్దుల్లో ఉన్న చింతలపూడి.. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. చింతలపూడి నియోజకవర్గంలో జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ.. చింతలపూడి నగర పంచాయతీతో పాటు.. జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కామవరపుకోట, లింగపాలెం మండలాలు ఉన్నాయి. 2. 80 ల‌క్ష‌ల‌ ఓట్లు ఉన్న నియోజకవర్గంలో.. 2.2 లక్షల ఓట్లు పోల్ అయ్యాయి.


ఎన్నికలకు ముందు పరిణామాలు.. ఎన్నికల ప్రచారం పోలింగ్ సర్వే చూస్తే.. ఇక్కడ సీన్ రివర్స్ అయినట్టు కనిపిస్తోంది. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజాని తప్పించి.. కంభం విజయరాజుకు అవకాశం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కూడా కొత్తగా ఎన్నారైగా ఉన్న సొంగా రోష‌న్‌ కుమార్ కు అవకాశం కల్పించింది. నామినేషన్ల పర్వం ప్రారంభానికి ముందు కచ్చితంగా తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందన్న అంచనాలు ఎక్కువగా వినిపించాయి. పలు సర్వేలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి.


అయితే ప్రచారం ముగుస్తున్న కొద్ది టీడీపీ కాస్త వెనకబడింది. డబ్బు పంపిణీతో పాటు.. పోల్ మేనేజ్మెంట్లో తెలుగుదేశం పార్టీ వైఫల్యంతో సీను ఒక్కసారిగా మారిపోయింది. కచ్చితంగా తెలుగుదేశం గెలుస్తుంది అన్న అంచనాల నుంచి.. హోరాహోరీ పోరు తప్పదేమో అన్న సందేహాలు చాలామందిలో కలిగాయి. అటు వైసీపీ.. ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరికి వారు చింతలపూడిలో తమ పార్టీ గెలుస్తుంది అన్న ధీమా ప్ర‌ద‌ర్శించే ప‌రిస్థితి వ‌చ్చేసింది.


అయితే ఫైన‌ల్ గా ఈ రోజు జ‌రిగిన కౌంటింగ్‌లో సొంగా రోష‌న్ కుమార్ ఏకంగా 26 వేల ఓట్ల భారీ మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించారు. ఎన్నారైగా వ‌చ్చిన రోష‌న్ అదిరిపోయే గెలుపుతో చింత‌ల‌పూడి అసెంబ్లీలో గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన వైసీపీపై అదిరిపోయే రివేంజ్ తీర్చుకున్నార‌నే చెప్పాలి. రోష‌న్ గెలుపు తో చింత‌ల‌పూడి పార్టీ కేడ‌ర్‌లో సంబ‌రాలు అయితే అంబ‌రాన్నంటి పోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: