కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్న జగ్గంపేట నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గ రాజకీయ ప్రాబల్యం ఎక్కువ. ఇక్కడ నుంచి గత కొన్ని దశాబ్దాలుగా కాపు సామాజిక వర్గానికి చెందిన వారే ప్రజాప్రతినిధులుగా గెలుస్తూ వస్తున్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో కాకినాడ జిల్లా పరిధిలో ఉన్న కిర్లంపూడి, గండేపల్లి, జగ్గంపేట మండలాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న గోకవరం మండలాలు విస్తరించి ఉన్నాయి. మామూలుగా జగ్గంపేట పేరు చెబితేనే జ్యోతుల నెహ్రూ, మాజీ మంత్రి తోట నరసింహం పేర్లు మనకు వినిపిస్తాయి. గత 20 ఏళ్లలో ఇక్కడ వీరిద్దరే రాజకీయంగా పట్టు కోసం ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.


2004, 2009 రెండు ఎన్నికలలోను జ్యోతుల నెహ్రూపై అతి స్వల్ప తేడాతో తోట నరసింహం విజయం సాధించారు. 2014లో వైసీపీ నుంచి గెలిచిన జ్యోతుల నెహ్రూ.. తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి 2019 ఎన్నికలలో ఓడిపోయారు. 2019లో మాత్రం వైసీపీ నుంచి జ్యోతుల చంటిబాబు.. నెహ్రూపై విజయం సాధించారు. అయితే మళ్లీ ఈసారి వైసీపీ నుంచి తోట నరసింహం  టీడీపీ నుంచి జ్యోతుల నెహ్రూ పోటీ చేస్తుండడంతో.. జగ్గంపేటలో పోరు ఆసక్తిగా మారింది. 2004, 2009 ఎన్నికలలో తనపై స్వల్ప తేడాతో గెలిచిన తోట నరసింహాన్ని ఈ ఎన్నికలలో ఎలాగైనా ఓడించాలని నెహ్రూ కసితో పనిచేశారు.


దీనికి తోడు జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు నేపథ్యంలో కాకినాడ పార్లమెంటుకు పక్కనే ఉన్న పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడంతో.. ఈ కూటమి జగ్గంపేట నియోజకవర్గం లో గట్టి ప్రభావం చూపించిందన్న మాట వాస్తవం. ఈసారి జగ్గంపేటలో ఎన్నికల హడావుడి ప్రారంభం కావటానికి ముందు నుంచి ప్రచారంలోనూ పోలింగ్ తర్వాత కూడా.. కచ్చితంగా నెహ్రూ గెలుస్తారన్న అంచనాలు బలంగా వినిపించాయి ఈరోజు జరిగిన కౌంటింగ్ లో ఏకంగా 52 వేల పై చిలుకు ఓట్ల భారీ మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించారు. 80 + ఏజ్‌లో నెహ్రూకు ఇది మామూలు ఘ‌న విజ‌యం కాద‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: