గత ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ మొత్తం వైసీపీ ఫ్యాన్ గాలి బలంగా వీచినా.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ గెలిచిన నాలుగు ఎమ్మెల్యే సీట్లలో పెద్దాపురం ఒకటి. అప్పుడు హోం మంత్రిగా ఉన్న నిమ్మకాయల చినరాజప్ప 4 వేల‌ ఓట్ల స్వల్ప తేడాతో పెద్దాపురంలో గెలిచి తన పట్టు నిలుపుకున్నారు. ఈసారి కూడా ఆయన పెద్దాపురం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. వ‌రుస‌గా మూడో ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న ఇక్క‌డ నుంచే పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన తోటవాణికి బదులుగా.. ద‌వులూరి దొరబాబుకు అవకాశం ఇచ్చారు. అటు చిన్నరాజప్ప.. ఇటు దొరబాబు ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడం విశేషం.


నియోజకవర్గంలో పెద్దాపురం - సామర్లకోట మున్సిపాలిటీల‌ తో పాటు.. పెద్దాపురం - సామర్లకోట మండలాలు విస్తరించి ఉన్నాయి. పెద్దాపురం నియోజకవర్గంలో కమ్మ సామాజిక వ‌ర్గం ఓటర్లు బాగా ప్రభావం చూపుతారు. కమ్మ, కాపు సామాజిక‌ ఈక్వేషన్‌తో పాటు.. జనసేన పొత్తు ఉన్న నేపథ్యంలో పెద్దాపురంలో కూటమి చాలా బలంగా కనిపించింది. దీనికి తోడు గతంలో హోం మంత్రిగా పనిచేసిన చినరాజప్పకు వైసీపీ అభ్యర్థి దొరబాబు అంత గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి కాదన్నా అంచనాలు, నివేదికలు ముందే వచ్చేసాయి.


అయితే చిన్నరాజప్ప ప్రచారంలో.. గతంతో పోలిస్తే అంత దూకుడు ప్రదర్శించలేదన్న చర్చ కూడా గట్టిగా నడిచింది. అయితే కమ్మ, కాపు సామాజిక వర్గాలు గట్టిగా కలిసి పని చేయటం టీడీపీ, జనసేన పొత్తు నేపథ్యంలో పెద్దాపురంలో కూటమి చాలా అంటే చాలా బలంగా కనిపించింది. అందుకే ఇక్కడ కచ్చితంగా టీడీపీ గెలుస్తుంది అన్న అంచనాలు, చర్చలు ఎక్కువగా నడిచాయి ఈరోజు జరిగిన కౌంటింగ్ లో 40451 ఓట్ల మెజార్టీతో చిన రాజ‌ప్ప ఘ‌న‌విజ‌యం సాధించారు. ఇది ఆయ‌న‌కు హ్యాట్రిక్ విజ‌యం.. గ‌తంలో హెం మంత్రిగా ఉండ‌డంతో ఈ సారి కూడా బాబు కేబినెట్లో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: