కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కాకినాడ కార్పొరేషన్‌లోని 66 - 70 డివిజన్లతో పాటు కాకినాడ రూరల్, కరప మండలాలు విస్తరించి ఉన్నాయి. జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు బలంగా పనిచేసిన నియోజకవర్గాలలో కాకినాడ రూరల్ నియోజకవర్గం ఒకటి. గత ఎన్నికలలో ఇక్కడ జనసేన నుంచి పోటీ చేసి మంచి ఓట్లు తెచ్చుకుని ఓడిపోయిన పంతం నానాజీకి పవన్ మరోసారి సీటు ఇవ్వగా.. ఆయన కన్నబాబును ఢీకొట్టారు. కాకినాడ పార్లమెంటు నుంచి జనసేన పోటీ చేస్తుండడం.. రూరల్ నియోజకవర్గం పక్కనే ఉన్న పిఠాపురంలో పార్టీ అధినేత పవన్ స్వయంగా పోటీ చేస్తుండడంతో.. ఆ ప్రభావం రూరల్ నియోజకవర్గం మీద గట్టిగా పని చేసింది.
ఎన్నికలకు ముందు పలు సర్వేలు, నివేదికలు, అంచనాలను బట్టి చూస్తే జనసేన మంచి మెజార్టీతో విజయం సాధించే నియోజకవర్గం రూరల్ కూడా ఒకటి ఉంటుందన్న అంచనాలు వచ్చేసాయి. రూరల్ నియోజకవర్గంలో జనసేన భారీ మెజార్టీతో గెలుస్తుంది అన్న పందాలు కూడా గట్టిగా నడిచాయి. ఈ రోజు కౌంటింగ్‌లో పంతం నానాజీ ఏకంగా 72040 ఓట్ల భారీ విజయంతో కనివినీ ఎరుగని రేంజ్‌లో మెజార్టీ సాధించి జెయింట్ కిల్లర్‌గా నిలిచారు. ఈ మెజార్టీ కాకినాడ హిస్టరీ లోనే రికార్డుగా నిలిచింది.