అయితే ఇదే ఇపుడు ఆంధ్రా పట్ల వరం కానుంది. ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రం రెండు ప్రభుత్వాలను మార్చడంతో దయనీయ పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం అప్పుల కుప్పలు తప్పితే ఇక్కడ ఖజానా మొత్తం ఖాళీ అన్న చందాన తయారైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రాకి కేంద్రం అండదండలు మెండుగా లేకపోతే మరో పదేళ్లు ఏపీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఆయా విషయాలను దృష్టిలో పెట్టుకొని బాబు మోడీని ప్రతిసాయంగా 5 లేదా 6గురు మంత్రుల్ని అడిగి తద్వారా ఆంధ్రాకి రావలసినవి రాబట్టుకోవాలని చూస్తున్నట్టుగా సమాచారం. అదేవిధంగా స్పీకర్ పదవిని తీసుకొని బయటనుండి మద్దతు ప్రకటించడం అనే అంశాలు పరిశీలిస్తున్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.
అవేగాని నెరవేరితే ఇక ఆంధ్రా జాతకం మారిపోయినట్టే. ఎందుకంటే ఆ షరతులకు ఒప్పుకుంటే ఏపీకి ప్రత్యేక హోదా వంటివి తేవడం చాలా తేలిక అవుతుంది. ఇకపోతే 2019 ఎన్నికల్లో కేవలం 23 అసెంబ్లీ సీట్లు, 3 లోక్ సభ స్థానాలను మాత్రమే గెలుచుకున్న టీడీపీ.. గడిచిన ఐదు సంవత్సరాలు తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. ఈసారి 2024 ఎన్నికల ముందు జనసేన, బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడటం టీడీపీకి బాగా కలిసొచ్చింది. నిన్న మొన్నటి దాకా ఎవరికీ పట్టని చంద్రబాబు నాయుడు ఇప్పుడు కేంద్రంలో సైతం కింగ్ మేకర్ కావడంతో టీడీపీ వర్గాలు పండగ చేసుకుంటున్నాయి. "మేం ఎన్డీయేతోనే ఉన్నాం" అని చంద్రబాబు చేసిన ఒక్క ప్రకటన స్టాక్ మార్కెట్‌ను లాభాల్లోకి తీసుకెళ్లిందంటే.. ఇప్పుడు ఆయనకే కాదు.. ఆయన మాటకున్న ప్రాధాన్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు.