ఇపుడు ఆంధ్రా అంతటా ఎక్కడ విన్నా ఒకే పేరు మారుమ్రోగిపోతోంది... అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒకప్పుడు సినిమాల రికార్డుల విషయంలో విన్న పేరు రాజకీయంలో రికార్డ్స్ పేరిట మారుమ్రోగిపోతోంది. అవును, జనసేనాని కూటమిలో భాగంగా పోటీ చేసిన అన్ని స్థానాలలో గెలిచి తన పవర్ ఏమిటో చూపించాడు. సమాజానికి రాజకీయంగా మేలు చేయాలన్న పవన్ తపనకు 2005 ప్రాంతంలో ఏర్పాటు చేసిన కామన్ మ్యాన్ ప్రోటెక్షన్ ఫోర్స్ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆ విధంగా అప్పుడు తనలోని సామాజిక సేవకు అంకురార్పణ జరిగింది. తరువాత 2008లో ప్రజారాజ్యం ఏర్పాటులో యువ రాజ్యం అధినేతగా పవన్ కళ్యాణ్ మంచి పాత్ర పోషించాడు.

తరువాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. తరువాతి కాలంలో విభజన ఏపీలో ఆయన జనసేన పార్టీని స్థాపించి తొలి ఎన్నికల్లో కేంద్రంలో మోడీకి ఏపీలో చంద్రబాబు సీఎం కావడానికి నిస్వార్ధంగా కృషి చేసి, కనీసం ఒక్క పదవి కూడా ఆశించలేదు. ఆయన కావాలనుకుంటే ఆనాడే రాజ్యసభ మెంబర్ అయి కేంద్రంలో మంత్రిగా చక్రం తిప్పేవారు. బీజేపీ నుంచి అటువంటి ఆఫర్ వచ్చినా దానిని తిరస్కరించారు. అదేవిధంగా బాబు మంత్రివర్గంలో కూడా చేరవచ్చు. కానీ ఆయన ఏపీ ప్రజలకు మంచి ప్రభుత్వం ఉండాలని అలాగే దేశంలో మోడీ పాలన రావాలని కోరుకుని పదవీ రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు.

ఆ తరువాత 2019లో ఆయన తొలిసారిగా ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి 2 చోట్లా ఓడిపోయారు. ఆయన పార్టీ నుంచి నెగ్గిన ఒకే ఒక్క ఎమ్మెల్యే కూడా నాటి వైసీపీలో చేరిపోయారు. ఈ ఘోరమైన ఓటమిని చూసిన తరువాత ఇంకొకరైతే రాజకీయ సన్యాసం తీసుకుంటారు. కానీ పవన్ పట్టు వీడలేదు. తన జీవితం ప్రజా సేవకే ఆయన అంకితం అన్నట్టు పట్టుదలగా 2019 నుంచి 2024 వరకూ జనంలో ఉంటూ పనిచేశారు. ఈ క్రమంలో ఆయన వారాహి యాత్ర చేస్తూ ఏపీ ప్రజలకు చేరువయ్యారు. అలా వైసీపీ మీద సమర శంఖం పూరించిన పవన్ కూటమిని ఏర్పాటు చేసి వైస్సార్సీపీ గోడలను బద్దలు చేశారు. తమకు అడ్డుఅదుపు లేదనుకుని విర్రవీగిన ప్రభుత్వం మెడలు వంచి మరీ కూర్చో బెట్టారు. కట్ చేస్తే నేడు వైసీపీకి ప్రతిపక్షం చోటు కూడా దక్కని పరిస్థితి నెలకొంది. అవును, అర్జునుడి అవతరమెత్తి శత్రువులను ఛిద్రం చేసిన జనసేనానిగా పవర్ స్టార్ నేడు అవతరించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు!

మరింత సమాచారం తెలుసుకోండి: