సూపర్ సిక్స్ గ్యారెంటీలలో భాగంగా వలంటీర్లకు నెలకు రూ.10,000 గౌరవ వేతనం ఇస్తానని ఒక హామీ ఇచ్చారు. ఏపీలో 2.5 లక్షల వలంటీర్లు ఉన్నారు. ఈ లెక్కన చూసుకుంటే నెల నెలా రూ.250 కోట్లు వీరికి ప్రభుత్వం అందించాల్సి ఉంటుంది. అంటే సంవత్సరానికి రూ.3,000 కోట్లు. ఐదేళ్లకు రూ.15 వేల కోట్లు. జగన్ వీళ్లకు నెలకు రూ.5 వేలు ఇచ్చారు. చంద్రబాబు దానిని డబుల్ చేసి ఇస్తానన్నారు. కానీ దానికంటే ముందు ఆయన వలంటీర్ వ్యవస్థ వల్ల ఉపయోగం లేదని, వాళ్లు ఆడవాళ్లు మాత్రమే ఉన్నప్పుడు ఇళ్లల్లోకి చొరబడుతున్నారని అన్నారు.
ఇదొక్కటే కాదు పవన్ కూడా వలంటీర్ల కారణంగా మహిళలు కిడ్నాప్ అవుతున్నారని షాకింగ్ కామెంట్లు చేశారు. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి గెలిచాక కూడా వాళ్లు ఇవే మాటలను మాట్లాడవచ్చు. వలంటీర్ల వల్ల లోకల్ ఎమ్మెల్యేలు బలహీన పడుతున్నారు. రాజకీయ కోణంలోనూ ఆలోచించి వీళ్లని పూర్తిగా తొలగించే ప్రమాదం లేకపోలేదు. ఇంతకుముందు లాగా ప్రజలే పథకాలను అందుకోవడానికి ఆఫీసులకు తిరగగలరు అని చంద్రబాబు నమ్మితే ఈ సిస్టమ్‌ను పూర్తిగా ఎత్తేయవచ్చు.
ఎలాగో ఏపీ ప్రజలు చంద్రబాబుని నమ్ముతారు కాబట్టి ఏమి చేసినా మళ్ళీ ఆయన్ని గెలిపించవచ్చు. మరో ఆల్టర్నేటివ్ లేదు అని చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తనకు నచ్చినట్లు చేయవచ్చు. ఒకవేళ బాబు వీళ్ల గురించి ఆలోచిస్తే కచ్చితంగా పెంచుతారు. మరి భవిష్యత్తులో ఏమవుతుందో చూడాలి. పెన్షన్ 4000 ఇస్తానన్నారు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణమన్నారు. నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి, ప్రతి తల్లికి సంవత్సరానికి రూ.15,000, రైతులకు 20 వేలు డబ్బులు ఇస్తామని వాగ్దానం చేశారు. కొన్ని సిలిండర్లు ఫ్రీగా అందిస్తామనీ తెలిపారు. వీటన్నిటినీ అమలు చేయక తప్పదు. వీటివల్ల ఖజానాపై బాగా భారం పడుతుంది. ఆల్రెడీ జగన్ చాలా అప్పులు చేశారు. మళ్లీ అప్పులు పుట్టకపోవచ్చు. దీనివల్ల ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.